కెనడాలో గత కొన్నేళ్లుగా ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిక్కు తీవ్రవాదులు పంజాబ్ నుంచి కెనడాకు రావాలనుకున్న సిక్కు యువకులను అన్ని విధాలా ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్టు ఆయా వర్గాలు ఇండియా టుడే టివీ ఛానల్‌కు వెల్లడించాయి.
పంజాబ్ నుంచి వచ్చే కెనడా యువ సిక్కులకు మైగ్రేషన్ ప్రకియ సులభతరం చేయడమే కాకుండా భారత వ్యతిరేక చర్యల్లో వారిని పదాతి దళంగా ఉపయోగించుకుంటున్నట్టు బయటపడింది. హరదీప్‌సింగ్ నిజ్జార్, మొయిందెర్ సింగ్ బుయాల్, భగత్‌సింగ్ బ్రార్, తదితర ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఈ విషయంలో కీలక పాత్ర వహిస్తున్నట్టు తేలింది.
ఖలిస్థాన్ అనుకూల వర్గాలు డిమాండ్, సరఫరా అసలు విధానాన్ని తారుమారు చేసి మోసంతో పంజాబ్ సిక్కు యువతను తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటున్నారని ఆయా వర్గాలు వెల్లడించాయి. ప్లంబర్లు, ట్రక్ డ్రైవర్లు, లేదా గురుద్వారాల్లో మత సంబంధ కార్యకర్తలుగా మధ్యతరహా నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామని వారిని నియంత్రిస్తున్నారు.
ఆయా యువకుల వీసాలకు, కెనడా సందర్శకులకు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారు ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాల కోసం పంజాబ్ యువతను వినియోగించుకుంటున్నారు. భారత్ వ్యతిరేక ఆందోళనల్లో సిక్కు మత సమ్మేళనల్లో వారిని భాగస్వాములు చేస్తున్నారు.
కెనడాలో చదువుకుని ఉద్యోగాలు దొరకని భారతీయ విద్యార్థులను కూడా ఖలిస్థాన్ వర్గాలు ఆకట్టుకుంటున్నాయి. రు. ఖలిస్థాన్ అనుకూల వర్గాలు కెనడా లోని సర్రే, బ్రాంప్టన్, ఎడ్మంటన్, తదితర ప్రాంతాల్లోని 30 గురుద్వారాలను తమ అధీనంలో నిర్వహిస్తున్నారు.
అమృత్సర్ లోని ఖలిస్థాన్ అనుకూల పార్టీ కెనడాలో ఆశ్రయం పొందాలనుకన్న యువత నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఛార్జీ వసూలు చేసి భారత్‌లో రాజకీయ ప్రక్షాళన జరగాలన్న వాదనతో కెనడా వెళ్లడానికి ధ్రువీకరణ లేఖలను ఇస్తున్నట్టు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో కెనడాకు చేరుకునే యువత తప్పనిసరిగా ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాల్లో చేరవలసి వస్తుంది. గత దశాబ్ద కాలంగా పంజాబ్ నుంచి నమోదయ్యే ఉగ్రవాద కేసుల్లో సగం కన్నా ఎక్కువ కెనడా ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నవేనని తేలింది.
2016 తరువాత పంజాబ్‌లో సిక్కులు, హిందువులు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యలన్నీ నిజ్జార్ తదితరుల మార్గదర్శకాల తోనే జరిగినట్లు బయటపడింది. దీనిపై ఇంతవరకు కెనడా నిఘా సంస్థలు ఎలాంటి దర్యాప్తు చేపట్టకపోవడం గమనార్హం.
ఫలితంగా కెనడా లోని అనేక గురుద్వారాల నుంచి ఖలిస్థానీలు భారత్ అనుకూల సిక్కులను కండబలం, ధనబలం ఉపయోగించి బలవంతంగా బయటకు తరిమి కొడుతున్నారు. రాను రాను కెనడాలో వీరు తమ పలుకుబడిని పెంచుకొంటూ, ఇప్పుడు బరితెగించి ధైర్యంగా కెనడా లోని హిందువులను బెదిరించడం, ఆలయాలను ధ్వంసం చేసే స్థాయికి చేరుకున్నారు.
కెనడా గడ్డపై నుండి దాదాపు 50 ఏళ్లుగా ఖలిస్థానీలు “భావప్రకటనా స్వేచ్ఛ, రాజకీయ న్యాయవాదం” తమ హక్కులుగా పేర్కొంటూ స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగించడం పరిపాటిగా మారింది. ఖలిస్థానీ ఉగ్రవాదుల విధ్వంస కాండకు ఉదాహరణ 1985 లో జరిగిన కనిష్క బాంబు దాడి.
అయితే సరైన దర్యాప్తు జరగక నిందితులు యధేశ్చగా తిరుగుతున్నారు. ఉగ్రదాడులను కొనసాగించడానికి పంజాబ్ నుంచి గ్యాంగ్స్టర్లను కూడా కెనడా ఖలిస్తానీ ఉగ్రవాదులు తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. అలాంటి కెనడా కేంద్రం గల గ్యాంగ్స్టర్లు పాకిస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్లును కూడా వినియోగిస్తున్నారు.
ఆ మాదక ద్రవ్యాలను పంజాబ్‌లో విక్రయిస్తున్నారు. ఆ సొమ్మంతా కెనడా లోని ఖలిస్థానీ ఉగ్రవాదుల జేబుల్లోకి వెళుతోంది. కెనడా నుంచి వీసా పొందడం చాలా కష్టమే అయినప్పటికీ, పంజాబ్ నుంచి సిక్కు యువకులను కెనడా ఖలిస్థానీలు రిక్రూట్ చేసే ప్రక్రియలను కెనడా ప్రభుత్వం కనుగొన లేక పోతోంది.
వియన్నా ఒప్పందం మేరకు ఖలిస్థానీ ఉగ్రవాదులను నివారించే బాధ్యత కెనడాకు ఉన్నప్పటికీ, ఇటీవల కెనడా లోని భారత్ రాయబార కార్యాలయాలను, దౌత్యవేత్తలను ఖలిస్థానీలు బెదిరించడం కెనడాకు పెద్ద సవాలుగా మారింది. ఖలిస్థానీ కార్యకలాపాలు, విధ్వంస కాండపై కెనడా మౌనం వహించడం ప్రశ్నార్థకమౌతోంది.