వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలే దేశంలో అభివృద్ధిని దెబ్బతీశాయని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పర్యటించారు. అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆ రోజులు ముగిశాయని చెప్పారు.
‘ఈ ఎన్నికలు జమ్ముకశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌ను విదేశీ శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పరివారవాదులు వంచన చేయడం ప్రారంభించారు. మీరు విశ్వసించిన రాజకీయ పార్టీలు మీ పిల్లల భవిష్యత్తును పట్టించుకోలేదు. వాళ్లు వాళ్ల వారసుల భవిష్యత్తుపైనే దృష్టిపెట్టారు. జమ్ముకశ్మీర్ యువత ఉగ్రవాదంతో బాధపడింది. ఈ వారసత్వ పార్టీలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి వేడుక చూశాయి.’ అని ప్రధాని విమర్శించారు.
‘2000 సంవత్సరం నుంచి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. కొత్త నేతలకు అవకాశం ఇవ్వలేదు. అందుకే కొత్త నాయకత్వాన్ని మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నించాను. తర్వాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయికి చేర్చడమే ఈ ఎన్నికల అసలు లక్ష్యం’ అని తెలిపారు.
“ఈ ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూలు ఉండేవని మీకు తెలుసు. లాల్‌చౌక్ వద్దకు వెళ్లాలంటే భయపడేవారు. కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఆ రోజులు ముగిశాయి’ అని చెప్పారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధాని మోదీ వెల్లడించారు. పలు హామీలను ప్రకటించారు. కాగా జమ్ముకశ్మీర్ ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా.. వరుసగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
కిష్త్వాడ్, ఉధంపుర్, పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లను మరింత పెంచినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. కాగా జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది.