తెలంగాణాలో రైతుల పేరుతో దోపిడీ జరుగుతోందని, కాలువలు, ప్రోజెక్టుల పేరుతో విడుదల అవుతున్నా ఎక్కడా పనులు జరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్ లో ఆదివారం జరిగిన బీజేపీ బహిరంగసభలో మాట్లాడుతూ రైతులకు బిజెపి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.
తెలంగాణ రైతులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. అదే విధంగా తెలంగాణాలో గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులో రూ.900 కోట్లతో సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుతో ఎంతో మేలు జరగనుందని చెబుతూ దేశవ్యాప్తంగా జరిగే పసుపు ఎగుమతులతో తెలంగాణ ఎక్కవ స్థాయిలో ఉందని ప్రధాని గుర్తు చేశారు. అందుకని ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని భావించామని చెప్పారు. పసుపు వంటి బంగారు దినుసులను పండించే రైతులను ఆదుకునేందుకు దేశంలోనే ప్రత్యేకమైన చర్యలు తీసుకుందని తెలిపారు.
పేదలకు ఇండ్లు, గ్యాస్ ఉచితంగా అందిస్తున్నామని చెబుతూ మహిళల జీవితాన్ని మెరుగుపరిచే కార్యక్రమాన్ని చేపట్టామని మోదీ చెప్పారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగిందని, మహిళా బిల్లును ఆమోదించుకున్నమని, ఎటువంటి గ్యారెంటీ లేకుండా ముద్రా రుణాలు అందిస్తున్నామని ప్రధాని వివరించారు. ఢిల్లీలో ఒక అన్న ఉన్నారనే విషయాన్ని మీరంతా గుర్తుంచుకోవాలని ప్రధాని కోరారు.
2014 వరకు తెలంగాణలో ఉన్న రహదారులను అభివృద్ధి చేశామని, పల్లె, పట్టణాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించామని ప్రధాని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధాని భరోసా ఇచ్చారు. ఈ 9 ఏండ్లలో 2500 కి.మీ రోడ్లను అభివృద్ధి చేశామని వెల్లడించారు.
అన్నదాతలను గౌరవిస్తున్నామని చెబుతూ వారి కష్టానికి తగిన ఫలితాన్ని కల్పిస్తున్నామని, నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లేలా చేశామని ప్రధాని గుర్తు చేశారు. తెలంగాణలో రైతుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఆదాయ మార్గంగా మార్చుకుందని, సాగునీటి ప్రాజెక్టుల పేరుమీద పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ప్రధాని ధ్వజమెత్తారు.
“దోపిడీ మీరు గమనిస్తున్నారు. రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది” అంటూ ఆరోపించారు. తెలంగాణలో బిజెపి సర్కారు లేకున్నా రైతులకు మేలు జరిగే పనులు చేపడుతున్నామని పేర్కొంటూ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,300 కోట్లను ఖర్చుపెట్టి పునరుద్ధరించామని ప్రధాని గుర్తు చేశారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు రూ.10వేల కోట్లను అందించామని తెలిపారు.
ముందుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉందంటూ తెలుగులో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పాలమూరు సభలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతోందన్న ప్రధాని… పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ రహదారులు, రైల్వేతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాచిగూడ-రాయ్ చూర్ మధ్య నూతన రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
హసన్-చర్లపల్లి హెచ్పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మల్లీ ప్రాజెక్టు పైప్ లైన్ ను ప్రారంభించారు. రూ.2457 కోట్ల నిర్మించనున్న సూర్యాపేట-ఖమ్మం హైవేకు శంకుస్థాపన చేశారు.