సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఉత్తర సిక్కింలో కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి. భారీ వర్షాలు కురవడంతో తీస్తా నదిలో ప్రమాద స్థాయి దాటి వరదలు ముంచెత్తడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.
కొన్ని వాహనాలు కూడా నీటమునిగాయి. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
చుంగతంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం 10 అడుగుల నుంచి 20 అడుగుల వరకు చేరుకుంది. బర్దాంగ్లోని సింగ్టమ్ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు వరద నీటిలో గల్లంతయ్యాయి.
ఉత్తర సిక్కింలో భారీ వర్షాలు కురవడంతో లోనాక్ లేక్ ఉధృతంగా అలుగు పోస్తుంది. తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తీస్తా నది సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు.
రోడ్లు కొట్టుకుపోయిన ఘటనలు, నది ఉధృతంగా ప్రవహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాన్ని సిక్కిమ్ ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ బుధవారం ఉదయం సందర్శించారు. వర్షం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. కానీ, ప్రజా ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లిందని తెలిపారు. ‘సింగ్టామ్లో కూడా కొంతమంది తప్పిపోయినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని ఆయన చెప్పారు.