వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నా కానీ, తన వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావించి పర్యటించలేదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన పర్యటన సహాయ పడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని స్పష్టం చేశారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని పవన్ హితవు చెప్పారు.
గత ప్రభుత్వ వైఖరి వల్లే విజయవాడ నగరంలో వరద కష్టాలు వచ్చాయని విమర్శించారు. విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన పరిశీలించారు. బుడమేరును పూర్తి చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, చిన్న చిన్న నీటి పాజెక్టులను పూర్తి చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని విమర్శించే సమయం కాదని బాధితులను రక్షించాలని స్పష్టం చేసారు.
ప్రస్తుతం విజయవాడలో వరద తగ్గుతోందని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. వరద బాధితులు సహాయం కోసం 112, 1070, 18004250101 ఫోన్ చేయాలని సూచించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రకృతి విపత్తు సమయంలో నిందల కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో ఇలాంటివి విపత్తులు జరగకుండా ఏం చేయాలనేది మంత్రి వర్గంలో చర్చిస్తామని పవన్ పేర్కొన్నారు. ప్రతి నగరానికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని పవన్ వివరించారు. వరద నిర్వహణ కోసం బృహత్ ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు. వరద సమయంలోతమ శాఖ క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని తెలిపారు.
కాగా, బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్కు అందజేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.