రెండేళ్లుగా మహారాష్ట్రలో ఎన్సీపీతో పాటుగా కాంగ్రెస్ తో కలసిన కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ ఆ పార్టీ పట్ల శివసేన ఎడమొఖం, పెడముఖంగా ఉంటూ వస్తున్నది. ఎన్సీపీని తప్ప తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సహితం తన అసంతృప్తిని బహిరంగానే వ్యక్తం చేస్తూ వచ్చింది. శివసేన సహితం కాంగ్రెస్ ను నమ్మదగిన భాగస్వామిగా పరిగణించడం లేదు.
రాహుల్ గాంధీకి సన్నిహితుడైన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ శివసేన తమ పార్టీని ఉద్దేశ్య పూర్వకంగా పాలనలో పక్కన పెడుతున్నట్లు పలుసార్లు విమర్శించారు. పైగా, శరద్ పవార్ ను కూటమికి “రిమోట్ కంట్రోల్” అంటూ ఎద్దేవా కూడా చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించడం ద్వారా శివసేనతో తమ పొత్తు తాత్కాలికమే అనే సంకేతాలు ఇస్తూ వస్తున్నారు.
అయితే గత నెలలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బనెర్జీ ముంబైకు వచ్చి, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పోరాడలేక పోతున్నదని అంటూ, కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పక్షాల కూటమి మాత్రమే బిజెపిని ఓడించగలదని చెప్పిన తర్వాత శివసేన వైఖరిలో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తున్నది. కాంగ్రెస్ లేకుండా జాతీయ ప్రత్యామ్న్యాయం సాధ్యం కాదంటూ మమతకు దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నది.
ఆ తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఢిల్లీలో వరుసగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో విడివిడిగా సమావేశాలు జరపడం గమనిస్తే స్పష్టమైన రాజకీయ ఎత్తుగడతోనే కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. మహారాష్ట్రను దాటి తమ రాజకీయ ప్రాబల్యంను పెంచుకోవడానికి కాంగ్రెస్ ను ఓ సాధనంగా ఉపయోగించుకొనే ఆలోచన కనిపిస్తున్నది.
ప్రియాంక గాంధీతో సమావేశం తర్వాత ఉత్తరప్రదేశ్, గోవా ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఆలోచిస్తున్నాయని చెప్పారు. ”హిందుత్వ, జాతీయవాదం లేకుండా ఏ పార్టీ బీజేపీని ఓడించలేదు. బిజెపిని ఎదుర్కోవడానికి సేన ఎంతో సహాయపడుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.
శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అభిప్రాయాలు వినిపించే నేతగా పేరొందిన రౌత్ మమతా ముంబై పర్యటన తర్వాత కాంగ్రెస్ ఆవశ్యకత గురించి తాను సంపాదకునిగా ఉన్న శివసేన దినపత్రిక సామ్నాలో బలమైన వాదనలు వినిపించారు. జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అంటూ స్పష్టం చేశారు.
శివసేన, ముఖ్యంగా రౌత్ కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సాన్నిహిత్యం ఉంది. అయితే రాహుల్ పట్ల తనకు అంతగా గౌరవం లేదని గతంలో పవార్ సంకేతం ఇచ్చారు. ఈ పరిస్థితులలో రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న, మూడవ సంవత్సరం పాలనలో ప్రవేశించిన మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) పాలక సంకీర్ణాన్ని పటిష్టంగా ఉంచడం అవసరం.
సంకీర్ణంలో సమస్యలు తలెత్తకుండా చేయడం కోసం, కాంగ్రెస్ లో అసంతృప్తికి అవకాశం లేకుండా చేయడం కోసం కూడా రౌత్ ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు. ఎందుకంటె ఈ కూటమి పట్ల మొదటి నుండి రాహుల్ గాంధీ ఆసక్తి ప్రదర్శించడం లేదు. కూటమి వద్దంటే పార్టీ ఎమ్యెల్యేలు ఫిరాయించే అవకాశం ఉన్నదనే అయిష్టంగానే అంగీకారం తెలిపారు.
కాంగ్రెస్ తో తమ సంబంధాలను మెరుగు పరచుకొనేందుకే శివసేన మమతకు దూరంగా జరుగుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత, ఫిబ్రవరి 2020లో, ఆయన తన కుమారుడు, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే, రౌత్‌తో కలిసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఆదిత్య 2020 జనవరి, ఆగస్టులలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని విడిగా కలిశారు.
2020 మే, ఆగస్టులలో జరిగిన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహించిన ప్రతిపక్ష పార్టీల రెండు సమావేశాలకు కూడా ఉద్ధవ్ హాజరయ్యారు. ఆగస్టు సమావేశంలో, ఉద్ధవ్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని అధికారాలు ఒక చేతిలో కేంద్రీకృతమై ఉన్నాయని, సమాఖ్య నిర్మాణాన్ని మరియు రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
కనీసం రెండు పర్యాయాలు రాహుల్ గాంధీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని కలవాలని రౌత్ ఆహ్వానించారు. సామ్నాలో, రౌత్ అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీని, అతని నాయకత్వాన్ని, కాంగ్రెస్‌ను సమర్ధిస్తూ వ్రాసారు.
మరోవంక, మహారాష్ట్రను దాటి ఎదగగల సామర్థ్యం తమకు ఉందని విశ్వసిస్తున్న సేన, తన జాతీయ ఆశయాలను గోప్యంగా ఉంచలేదు. 2020లో పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా, ఠాక్రే మాట్లాడుతూ, “మీరు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని బలంగా నడిపిస్తున్నారు. మీరు దేశానికి నాయకత్వం వహించాలి” అని రౌత్ చేసిన సూచనను ప్రస్తావిస్తూ “ఒక రోజు శివసైనికుడు ప్రధానమంత్రి అయితే నేను సంతోషిస్తాను” అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, గత నెలలో దాద్రా, నగర్ హవేలీ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సేన అభ్యర్థి లోక్ సభకు ఎన్నికైన తర్వాత మహారాష్ట్ర వెలుపల రాజకీయ పొత్తులు కుదుర్చుకోగల సామర్థ్యంపై పార్టీలో విశ్వాసం పెరిగింది. ఇది మహారాష్ట్ర వెలుపల శివసేన సాధించిన మొదటి విజయం. గతంలో బిజెపి గెలుపొందిన సీట్ లో గెలిచింది.
ఈ విజయం పార్టీని ఇతర రాష్ట్రాల్లో తన ఉనికిని విస్తరించడంపై దృష్టి పెట్టేలా ప్రేరేపిస్తున్నట్లు శివసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అందుకే కాంగ్రెస్‌తో పొత్తుకోసం శివసేన చూస్తోంది. గతంలో ఉత్తరప్రదేశ్, బీహార్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించకుండానే ఆ పార్టీ పోటీ చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ, గోవాలో పొత్తు కోసం ప్రియాంకతో రౌత్ జరిపిన చర్చలు ఈ విషయంలో ముఖ్యమైనవి.