బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను 14 రోజులపాటు రిమాండ్ కు పంపుతూ కింది కోర్ట్ ఇచ్చిన ఉత్తరువును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. దానిని కొట్టివేస్తూ, వెంటనే వ్యక్తిగత పూచీపై విడుదల చేయమని ఆదేశించింది.
కరోనా నిబంధనలు ఉల్లంఘించారని రిమాండ్ రిపోర్టు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. పైగా, అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా ప్రశ్నించింది. రిమాండ్ చేయడంలో మీ ప్రత్యేక శ్రద్ధ ఏంటని అంటూ పోలీసులను నిలదీసింది. పోలీసులు పెట్టిన 333 సెక్షన్ అక్రమమని, ఎఫ్ఐఆర్ లో నుండి ఆ సెక్షన్ తొలగించాలని పేర్కొంటూ చట్టాన్ని అందరికి సమానంగా వర్తింపజేయాలని హితవు చెప్పింది.
కరీంనగర్లో తనపై నమోదు చేసిన కేసులపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కరీంనగర్ మెజిస్ట్రేట్ ఇచ్చిన జ్యూడిషియల్ రిమాండ్ ఆర్డర్‌ను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. బండి సంజయ్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
బండి సంజయ్ ను విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీకి హైకోర్టు ఆదేశమిచ్చింది. రెండు విషయాలలో పోలీసుల తీరును న్యాయస్థానం తప్పబట్టింది. ఎఫ్ఐఆర్ సహితం లోపభూయిష్టంగా ఉన్నదంటి పేర్కొంది సంజయ్ కుడిచేయి వేలికి గాయమైందని ఎఫ్ఐఆర్ లో పేర్కొని సెక్షన్ 333 అదనంగా చేర్చారని, కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం ఇంకా మెడికల్ రిపోర్ట్ అందాల్సి ఉందని పోలీసులు చెప్పారని కోర్టు తెలిపింది.
అరెస్టు చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు.. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 17వ తారీఖు వరకు రిమాండ్ ఇవ్వడం అనేది సరైనది కాదంటూ.. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.