ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం కారణంగా ఆయన అర్ధాంతరంగా పర్యటనను ముగించుకొని వెనుతిరగడం పట్ల కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. పంజాబ్ శాసన సభకు త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పాల్గొనవలసిన తొలి బహిరంగ సభ రద్దయింది.
ఫిరోజ్పూర్లో బుధవారం ఈ సభ జరగవలసి ఉండగా, ప్రధాన మంత్రి భద్రత విషయంలో తీవ్ర లోపం ఉందని, అందువల్లే ఈ సభ రద్దయిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
రెండేళ్ల తర్వాత తొలిసారిగా ప్రధాని పంజాబ్ పర్యటనకు వెళ్లారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం భటిండా చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి వెళ్ళవలసి ఉంది.
వర్షం కురుస్తుండటం, దారి కనిపించకపోవడం వల్ల ఆయన దాదాపు 20 నిమిషాలపాటు వేచి చూశారు. వాతావరణం సానుకూలంగా మారకపోవడంతో, రోడ్డు మార్గంలో ప్రయాణించి, అమరవీరుల స్మారక కేంద్రానికి చేరుకోవాలని నిర్ణయించారు. రోడ్డు మార్గంలో వెళ్తే రెండు గంటలకు పైగా సమయం అవసరమవుతుంది.
పంజాబ్ డీజీపీ నుంచి భద్రతా సంబంధిత ధ్రువీకరణ పొందిన తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణం ప్రారంభించారు. అయితే జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో, ఫ్లైఓవర్ వద్దకు మోదీ కాన్వాయ్ చేరుకునేసరికి, కొందరు నిరసనకారులు ఆ రోడ్డును దిగ్బంధనం చేసినట్లు తెలిసింది. ఆ ఫ్లైఓవర్‌పై మోదీ దాదాపు 20 నిమిషాలపాటు చిక్కుకున్నారు.
అమరవీరుల స్మారక కేంద్రంకు వెళ్ళవలసిన మూడు రహదారులు కూడా ఆ సమయంలో దిగ్బంధనంకు గురికావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని మండిపడుతూ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక కోరింది.
ఉద్దేశపూర్వకంగానే ప్రధాని ర్యాలీని అడ్డుకున్నారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ధ్వజమెత్తారు. పోలీసులు నిరసనకారులలతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ నిరాకరించారని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా, ప్రధాని పర్యటన రద్దుపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ. ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం లేదని చెబుతూ ఎదురు దాడికి దిగారు. ప్రధాని ప్రసంగించవలసిన సభలో జనం లేరని తెలుసుకొని, వెనుకకు వెళ్లారని అంటూ చెప్పుకొచ్చారు తాను మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రధాని పాల్గొనే కార్యక్రమ భద్రతా చర్యలను సమీక్షించానని పేర్కొన్నారు.
ఈ లోపానికి కారణం పంజాబ్ ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ప్రధాన మంత్రి పర్యటన వివరాలను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామని, రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయవలసి ఉందని తెలిపింది. ఈ భద్రతా లోపం కనిపించడంతో తిరిగి భటిండా విమానాశ్రయానికి వెళ్ళిపోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
రోడ్డు మార్గంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కానీ ఆ విధంగా చేయలేదని పేర్కొంది. దీనికి కారణాలను, బాధ్యులను నిర్థరించడం కోసం ఓ నివేదికను సమర్పించాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది.
ఇలా ఉండగా, ప్రధాన మంత్రికి హాని చేసే ప్రయత్నం జరిగినదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ప్రధాని మోదీని కాంగ్రెస్ ద్వేషిస్తుందనే విషయం అందరికీ తెలుసునని ఆమె గుర్తు చేశారు. నేడు ఆ పార్టీ భారత దేశ ప్రధాన మంత్రికి హాని చేసే ప్రయత్నం చేసిందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిసియుండి ప్రధాన మంత్రిని అపాయంలోనికి నెట్టే పరిస్థితిని సృష్టించిందని ఆమె ఆరోపించారు.
మోదీ ప్రయాణించే మార్గంలోకి నిరసనకారులు వచ్చిన సమయం గురించి ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. అనేక మంది ప్రజలు అక్కడికి చేరుకోవడం యాధృచ్ఛికం కాదని, ఇది స్పష్టంగా కుట్ర అని ఆమె స్పష్టం చేశారు. తెలిపారు. భద్రతా లోపానికి బాధ్యులు ఎవరని ఆమె ప్రశ్నించారు. పంజాబ్ పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారని, భద్రతా సంబంధిత మార్గదర్శకాలను పాటించలేదని ఆమె మండిపడ్డారు.