తనకు, బిజెపి వారికి జైలుకు వెళ్లడం కొత్తకాదని అంటూ ఇక సీఎం కేసీఆర్ ను కూడా జైలుకు పంపుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంబధం చేశారు. హైకోర్టు ఉత్తరువుతో గతరాత్రి కరీంనగర్ జైలునుండి విడుదలైన ఆయన కేసీఆర్ జైలు వెడితే ఆయనను కాపాడే వారెవ్వరూ ఉండబోరని హెచ్చరించారు.
తాను ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోసం జైలుకు వెళ్లానని, అయితే కేసీఆర్ మాత్రం వేరే అంశంపై జైలుకు వెళ్తారని అంటూ పరోక్షంగా అవినీతి కేసులపై వెడతారనే సంకేతం ఇచ్చారు. జీవోను వెంటనే సవరించకుండా కేసీఆర్ సంగతి చూస్తానంటూ హెచ్చరించారు.
బీజేపీ కార్యకర్తల చేతులు, కాళ్లు విరగొట్టారని, మహిళా కార్యకర్తలపై అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కార్యాలయంపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. “మేము ఏమైనా దుండగులమా, హంతకులమా దోపిడి దారులమా.. ధర్మం కోసం, తెలంగాణ సమాజం కోసం పనిచేసే వ్యక్తులం. భయపడం” అంటూ స్పష్టం చేశారు.
ఉద్యోగులు ఇప్పుడు కూడా స్పందించకుంటే జీవితాంతం ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుందని సంజయ్ చెప్పారు. తెలంగాణలో ధర్మ యుద్దం ప్రారంభమైందని, సీఎం కేసీఆర్ను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇలా ఉండగా, జిఓ పాలన రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ, ఉద్యమిస్తున్న బిజెపి నాయకుల అక్రమ అరెస్టులు, పోలీసుల దాడులకు నిరసనగా ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త బంద్ కు బిజెపి పిలుపిచ్చింది.