ఇండియా కూటమి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోనే ఆ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. సీట్ల సర్దుబాట్లపై మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య తలెత్తిన విభేదాలు కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ `పెద్దన్న పాత్ర’ పోషిస్తున్నట్లు మండిపడుతూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేస్తున్న వాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి.
వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పీడీఏ(వెనుకబడిన వర్గాలు, దళితులు, అల్పసంఖ్యాక వర్గాలు) విజయం సాధిస్తుందని పేర్కొనడం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ‘ఇండియా’ కూటమి ఉండదన్నట్టుగా అఖిలేశ్ పరోక్ష సంకేతాలు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది. కూటమిలో కొనసాగే ఉద్దేశ్యంలో ఆయన లేన్నట్లు స్పష్టం అవుతుంది.
ఏ ఎన్నికలు వచ్చినా కలిసి పనిచేయాలని ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు మధ్య ప్రాథమిక అవగాహన కుదిరింది. అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం పట్ల ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడుతున్నారు.
మిత్ర ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీయే పాటించకపోతే అందులో ఇతర పక్షాలు కొనసాగడంలో అర్థం లేదని అంటున్నారు. ఇదే విషయాన్ని తమకు ముందే చెప్పి ఉంటే కూటమిలో చేరాలా? వద్దా? అని నిర్ణయం తీసుకునే వారమని కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఎస్పీకి ఐదు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఒక్కటి కూడా ఇవ్వకుండా 230కిగానూ 229 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. దీని ద్వారా కూటమిలోని ఇతర పార్టీలను కాంగ్రెస్ ‘ఫూల్స్’ చేసిందని అఖిలేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్ తమ పార్టీ నేతలను చివరి వరకు చుట్టూ తిప్పుకొని చివరికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. రేపటి రోజున ఉత్తరప్రదేశ్‌లో వారికి ఇదే పరిస్థితి ఎదురుకాక తప్పదని హెచ్చరించారు.
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ తమకు సీట్లు ఇవ్వనప్పుడు.. తాము కూడా అదేవిధంగా చేస్తే తప్పేమంటని అఖిలేశ్ నిలదీశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడే విభేదాలు బయటపడ్డాయి.
కూటమి ఏర్పాటు సమయంలో కనిపించిన ఐక్యత.. ఎన్నికల సమయం వచ్చే సరికి లేదనే దానికి కాంగ్రెస్-ఎస్పీ మధ్య తలెత్తిన విభేదాలే నిదర్శనమని స్పష్టం అవుతుంది.