ఎపి లోని వైసిపి తిరుగుబాటు పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజు త్వరలో తాను ఎంపి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళతానని ప్రకటించారు. ”అమరావతి రాజధానితోపాటు ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడం కోసం తాను నిర్ణయం తీసుకోబోతున్నా”నని వెల్లడించారు.
తమ పార్టీకి చెందిన ఎంపి లు తనపై అనర్హత వేటు వేయించాలని ప్రయత్నిస్తున్నారని, అనర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని రఘురామరాజు స్పష్టం చేశారు. వారి ప్రయత్నాలకు ఇంకా సమయం ఇస్తున్నానని అంటూ ఒక విధంగా సవాల్ చేశారు.
అనర్హత వేటు వేయించకపోతే తానే రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళతానని రఘురామ వెల్లడించారు. పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానని చెప్పారు. కొంతకాలంగా ఎపి సిఎం జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్న రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని రేపాయి.
ఈ సందర్భంగా వాలంటరీ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. ‘సీఎం జగన్ రాయలసీమకు అన్యాయం చేశారు. ఏసీబీ దాడులతో భయపెడితే జగన్‌కు పరాభవం, పరాజయం తప్పదు’ అంటూ స్పష్టం చేశారు.
సొంత పార్టీని బలేపేతం చేసుకోవటానికే వాలంటీర్, సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. నెలలో మాడు, నాలుగు రోజులు మాత్రమే వాలంటీర్లకు పని ఉంటోందని చెబుతూ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలు తీర్చలేకపోతున్నానని సీఎం జగన్ చెప్పటం పట్ల విచారం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పేంటో జగన్ చెప్పాలి..?. అని ప్రశ్నించారు. సచివాలయాలు కట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు. ఉద్యోగుల పట్ల సీఎం జగన్ వ్యవహరించిన తీరు పద్ధతిగా లేదని విమర్శించారు.
గోదావరి జిల్లాలో గిరీష్ ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలో స్టీల్ ఫ్లాంట్ , కుందు ప్రాజెక్టు కట్టడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.