రానున్న రోజుల్లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బలి పశువు కాక తప్పదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హస్తం పార్టీలో సీనియర్లంతా సీఎం పదవి కోసమే కొట్లాడుతున్నారంటూ సెటైర్లు వేస్తూ రేవంత్ రెడ్డిని సీఎం చేయొద్దని ముస్లిం మత పెద్దలు ఇప్పటికే రాహుల్ గాంధీని కలిశారంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవల కొందరు ముస్లిం మతపెద్దలు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసి, మద్దతు ప్రకటించినట్లు తనకు తెలిసిందని సంజయ్ చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయబోమని హామీ ఇస్తేనే తాము మద్దతు ఇస్తామని అన్నారని, అందుకు రాహుల్ గాంధీ కూడా సరేనన్నట్లు తనకు తెలిసిందని వెల్లడించారు.
అయితే బీజేపీలో ముఖ్యమంత్రిని ముందే ప్రకటించే సంస్కృతి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఏదేమైనా తెలంగాణలో మాత్రం కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్ బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తామని బండి సంజయ్ ఉద్ఘాటించారు. అయితే తాను ముఖ్యమంత్రి అవుతానని ఒకరిద్దరు చేప్తే కాదని, అది అధిష్ఠానం నిర్ణయమని చెప్పుకొచ్చారు.
ఈనెల 7 తేదీన హైదరాబాద్ లో బీసీ ఆత్మీయ గౌరవ సభ నిర్వహిస్తున్నామని, ఆ సభకు ప్రధాన మంత్రి మోదీ హాజరవుతున్నారని బండి సంజయ్ తెలిపారు. కార్యకర్తలంతా స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నట్టు అన్ని సర్వేలు చెప్తున్నాయని చెబుతూ ఖబ్జా రాయుడు ఓడిపొతున్నాడని, కరీంనగర్ గడ్డపై కషాయ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు.
