ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసులు గత పదేళ్లుగా ముందుకు సాగక పోతుండడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు చేరింది. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ పైన బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే సీఎం జగన్ కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య తన పిటీషన్ లో న్యాయస్థానాన్ని అభ్యర్దించారు. ఈ విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. హరిరామజోగయ్య పిల్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది.
సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోర్టుకు జోగయ్య వినతి చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రతివాదులు సీఎం జగన్, సీబీఐతో పాటుగా సీబీఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు వరుస కేసుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన పైన వాదనలు పూర్తి కావటంతో గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇటు హైకోర్టులోనూ చంద్రబాబు బెయిల్ పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
ఈ సమయంలో ఇటు సీఎం జగన్ పైన హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్ లో విచారణ..తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వటంతో ఆసక్తి కొనసాగుతోంది. మరోవంక, జగన్ పై అక్రమాస్తుల కేసుల విచారణ తెలుగు రాస్త్రాలలో ముందుకు సాగకపోవడంతో ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా ఢిల్లీకి బదిలీ చేయాలనీ కోరుతూ వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. దానిని విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు సీబీఐకి, వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చింది.
మరోవంక, ఏపీ ప్రభుత్వ అవినీతిపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిల్ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే జస్టిస్ రఘునందన్ ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ విచారణ నుంచి తప్పుకొన్నారు.
దీంతో రఘురామ పిల్‌ను ఏ బెంచ్ విచారణ చేయాలో సీజే మళ్లీ నిర్ణయించనున్నారు. వేరే బెంచ్‌కు విచారణ వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని సీజే ఆదేశించారు. సీఎం జగన్, ఆయన బంధు గణానికి, వివిధ కంపెనీలకు రూ.కోట్ల అనుచిత లబ్ధి చేకూరేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలుపై సీబీఐ దర్యాప్తు చేయాలని రఘురామ పిటిషన్ వేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని పిల్లో ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. సీఎం వైఎస్ జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. ప్రజా ధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిల్లో ప్రస్తావించారు. ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై పూర్తిగా విచారణ చేయాలని కోరినట్లు తెలుస్తోంది.