వెండితెరపై తమ అందచందాలతో, నటనా నైపుణ్యంతో మెరిసిపోయి, తెలుగు వారిలో మంచి పేరు తెచ్చుకున్న పలువురు సినీ తరాలకు తెలంగాణ ఎన్నికల సందర్భంగా బిజెపి మాత్రం మొండిచెయ్యి చూపోయించింది. ఎన్నికలలో పోటీచేయాలని ఉబలాటపడిన కనీసం ఐదుగురు ప్రముఖ హీరోయిన్ ల ఆశలను నిరాశ పరిచింది.
అయితే, సీటు ఇచ్చినా పోటీ చేయనని మీడియా ముందు పార్టీ నాయకులను దుమ్మెత్తి పోసిన మాజీ మంత్రి బాబూమోహన్ కు మాత్రం గెలిచే అవకాశం లేదని తెలిసినా మరోసారి సీటు ఇచ్చింది. బిజెపి అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించిన విజయశాంతి, జయసుధ, జీవిత, మాధవీలత, రేష్మత్ రాథోడ్ లను మాత్రం పార్టీ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు.
1998లోనే బీజేపీలో చేరి, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉంటూ 1999 ఎన్నికలలో పార్టీ కోసం విశేషంగా ప్రచారం చేసిన విజయశాంతి తెలంగాణ ఉద్యమం కోసం పార్టీని వదిలి టిఆర్ఎస్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2014లో ఎమ్యెల్యేగా పోటీచేసిన గెలుపొందలేక పోయారు. అయితే, 2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిన ఆమె ఎన్నికలలో పోటీచేయాలని తన అభిలాషను బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఏమయిందో గాని కొంతకాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా ఆమెను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవ్వాలో, రేపో ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఇక, 2009లో నాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ లో చేరి, సికింద్రాబాద్ నుండి ఎమ్యెల్యేగా గెలుపొందిన జయసుధ రాష్త్ర విభజన అనంతరం రాజకీయంగా దిక్కుతోచని విధంగానే ఉంటున్నారు. 2016లో టిడిపిలో చేరినా, ఆ తర్వాత వైసిపిలో చేరినా ప్రయోజనం లేకపోయింది. సికింద్రాబాద్ నుండి పోటీ చేసేందుకు ఈ మధ్యనే బీజేపీలో చేరినా ఆమెకు సీటు రాలేదు.
ఇక ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని జీవిత 2014 ఎన్నికలకు ముందే బీజేపీలో చేరి కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలుగా అయ్యారు. ఆ తర్వాత వైసిపిలో చేరినా అక్కడా పట్టించుకోలేదు. తర్వాత బీజేపీలో చేరి, ఎన్నికలలో హైదరాబాద్ నుండి పోటీ చేసేందుకు మూడు నియోజకవర్గాల నుండి దరఖాస్తు చేసుకున్నారు. అయినా, ఆమెకు కూడా సీటు ఇవ్వలేదు.
ఇక గుంటూరుకు చెందిన మాధవీలత 2019 ఎన్నికలలో గుంటూరు నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. ఈ సారి హైదరాబాద్ నుండి పోటీ చేద్దాం అనుకున్న ఆమెకు నిరాశే ఎదురయింది. 2018లో బీజేపీలో చేరిన రేష్మా రాథోడ్ బయ్యారం ఉక్కు పరిశ్రమే ద్యేయంగా తన వాగ్దాటితో యువతను ఆకర్షించారు. అయితే ఆమె చరిష్మా ఆమెకు బిజెపి సీటు పొందేందుకు దోహదం చేయలేదు.