ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ఎనిమిదోసారి వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించింది. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించిన భారత్‌తో ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగనున్న టైటిల్ ఫైట్‌లో ఆసీస్ తలపడనుంది.
బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇరు జట్ల బౌలర్లు రాణించినా.. ఒత్తిడిని అధిగమించిన ఆసీస్‌ను విజయం వరించింది. టోర్నీ ఆసాంతం తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోర్లు చేస్తూ.. ప్రత్యర్థులను హడలెత్తించిన దక్షిణాఫ్రికా ఈ సారి అదే ప్రదర్శన పునరావృతం చేయలేకపోయింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆణిముత్యం లాంటి సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు.
మెగాటోర్నీలో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. కొత్త రికార్డులు నెలకొల్పిన స్టార్లు కీలక మ్యాచ్‌లో విఫలమయ్యారు. కెప్టెన్ టెంబా బవుమా (0) తొలి ఓవర్లోనే ఖాతా తెరవకుండా వెనుదిరగగా.. డికాక్ (3), మార్క్మ్ (10), డసెన్ (6) అతడిని అనుసరించారు. దీంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో క్లాసెన్, మిల్లర్ పోరాడి జట్టును తిరిగి పోటీలోకి తెచ్చినా.. హెడ్ ఒకే ఓవర్లో క్లాసెన్, జాన్సన్ (0) ఔట్ చేసి సఫారీలను తక్కువ స్కోరుకు పరిమితం చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో మూడు, హజిల్‌వుడ్, హెడ్ చెరో 2 వికెట్లు తీశారు. సఫారీ ఇన్నింగ్స్‌కు కాసేపు వర్షం అంతరాయం కలిగించింది.
అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా.. 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30), జోష్ ఇంగ్లిస్ (49 బంతుల్లో 28), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; ఒక ఫోర్, 4 సిక్సర్లు) రాణించారు.