తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రకటించింది. 42 పేజీల్లో 62 అంశాలను పేర్కొంది. ఇందులో అన్ని వర్గాలకు సంబంధించి అంశాలను ప్రస్తావించింది. కీలకమైన ధరణి ప్లేస్ లో భూమాత పోర్టల్ ను తీసుకువస్తామని స్పష్టం చేసింది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటుతో పాటు నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకువస్తామని తెలిపింది.
ఇక రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచితంగా ఫ్రీవైపై ఇస్తామని తెలిపింది కాంగ్రెస్. ఇక ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేసింది. 2 లక్షల ఉద్యోగాల వివరాలను పేర్కొంటూ భర్తీ చేసే తేదీలను కూడా పేర్కొంది. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల భరోసా కార్డును ఇస్తామని తెలిపింది. టీఎస్పీఎస్సీ పరీక్షలకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
ఇక రాష్ట్రంలో పూర్తిగా బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని స్పష్టం చేసింది. కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువస్తామని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రస్తావించింది. కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌కు పదవీ విరమణ సమయం వచ్చేసిందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైందని మేనిఫెస్టోను విడుదల చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భరోసా వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అమలు చేస్తామని చెబుతూ కర్ణాటకలో ఐదు హామీలను ఇచ్చి వాటిని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొలి మంత్రివర్గంలోనే ఆమోదిస్తామని ఖర్గే చెప్పారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. బిజెపి, బీబిఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. బిఆర్ఎస్పై బిజెపి నేతలు విమర్శలు తగ్గించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోదీ పరస్పర విమర్శలు మానేశారని చెబుతూ వారిద్దరు కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా ఆపలేరని తేల్చి చెప్పారు.
బిఆర్ఎస్ మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారని తెలిపారు. కెసిఆర్ ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని స్వయంగా చెప్పాడని, అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిందని చెప్పారు.
అన్ని వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టోను రూపొందించామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన అంశాలను ఇందులో పొందుపరిచామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి… అధికారం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేయటంతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ దళిత, గిరిజనులకు మేలు చేసేలా మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేలా ఉందని చెప్పారు. పేదలకు భూములపై హక్కులు కల్పించేలా పలు అంశాలను పేర్కొన్నారు తెలిపారు.ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని పార్టీ నేతలు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.