ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు 75 శాతం కోటాను కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పంజాబ్ హరియాణా హైకోర్టు కొట్టివేసింది. హరియాణ ప్రభుత్వ స్థానికుల ఉపాధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. హరియాణా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్థానిక అభ్యర్థుల చట్టం 2020లో ఆమోదించిన తర్వాత అనేక మార్పులు చేశారు.
ప్రైవేటు రంగంలో రూ. 30,000 కంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగాల్లో 75 శాతాన్ని స్థానికులు లేదా నివాస ధ్రువీకరణ పత్రం ఉన్నవారికి కేటాయించారు. గతంలో 15 సంవత్సరాలుగా పేర్కొన్న స్థానికత నిబంధనలను ఐదేళ్లకు తగ్గించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్నందున స్థానిక వర్గాల ఓట్లను ముఖ్యంగా జాట్ కమ్యూనిటీని ఏకీకృతం చేయడంపై దృష్టి సారించి చట్టం తీసుకొచ్చిన మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అయితే, ఈ తీర్పుపై రాష్ట్రం అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.
బిల్లును నవంబరు 2020లో హరియాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్‌కు పంపారు. దీనిపై గవర్నర్ 2021 మార్చిలో సంతకం చేయడంతో చట్టంగా మారింది. ప్రైవేటు సంస్థల్లో స్థానిక కోటా అమలు అనేది బీజేపీ సంకీర్ణ సర్కారులోని జననాయక్ జనతా పార్టీ మానసపుత్రిక. ఆ పార్టీకి చెందిన దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
ఆ పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల హామీల్లో ఇది ప్రధానమైంది. 2020లో హరియాణా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ అభ్యర్థుల బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు.. ‘తక్కువ వేతనం లభించే ఉద్యోగాల కోసం వలసదారులు పోటీ స్థానిక మౌలిక సదుపాయాలు, గృహాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.. మురికివాడల విస్తరణకు దారి తీస్తుంది’ అని పేర్కొంది.
బిల్లును తీసుకురావడాన్ని సమర్థిస్తూ సాధారణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తక్కువ జీతంతో ఉద్యోగాలలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా అవసరం’ అని తెలిపింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గురుగ్రామ్ ఇండస్ట్రియల్ అసోసియేషన్, ఇతర యాజమాన్య సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ చట్టం వెనుక ఉన్న భూమిపుత్రులు అనే భావన యజమాన్యాల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు. ఈ చట్టం రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ సూత్రాలకు విరుద్ధమని కూడా వారు పేర్కొన్నారుభారత్లో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌లలో ఒకటైన గురుగ్రామ్‌లో పరిశ్రమ అభివృద్ధిపై చట్టం ప్రభావం చూపుతుందనేది ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్- హరియాణా హైకోర్టు ఫిబ్రవరి 2022లో ఈ చట్టంపై స్టే విధించింది.
అయితే హరియాణా ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేసింది. ఈ పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో చట్టం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ జస్టిస్ జీఎస్ సంధావలీయా, జస్టిస్ హర్పీత్ కౌర్ జీవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మానసం కొట్టివేసింది.