మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు శుక్రవారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. కడపటి వార్తలు అందే సమయానికి మధ్యప్రదేశ్‌లో 76.22 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 74 శాతం ఓటింగ్ నమోదైంది.
మధ్యప్రదేశ్‌లోని ఛతార్పూర్ జిల్లా రాజ్‌నగర్‌లో రెండు పార్టీల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘర్షణల్లో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమ్ సింగ్ అనుచరుడు ఒకరు మరణించాడని జిల్లా ఎస్పీ అమిత్ సంఘి వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ఇతర చోట్ల కూడా ఘర్షణలు చోటుచేసుకొన్నాయి.
ఇండోర్ జిల్లా మహూ ఏరియాలో రెండు గ్రూపుల మధ్య వాగ్వివాదంలో ఐదుగురు గాయపడ్డారు. మోరేనా జిల్లా దిమాని నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఓటేసేందుకు వెళ్తున్న వారిని కొంత మంది అడ్డుకోవడంతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరికి గాయాలయ్యాయి.
చత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌లో భాగంగా 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. తొలి విడత కింద 20 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
అలాగే కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమార్ పోటీ చేస్తున్న మోరేనా జిల్లాలోని దిమాని నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఈ చిన్నపాటి ఘర్షణలు మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పిసిసి అధ్యక్షుడు కమల్‌నాథ్ , లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ , పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నక్సల్స్ మందుపాతరకు ఐటిబిపి జవాను బలి
కాగా చత్తీస్‌గఢ్‌లోని గరియాబండ్ జిల్ల్లాలో నక్సల్స్ అమర్చిన మందుపతరకు ఐటిబిపి జవాను బలి అయ్యారు. పోలింగ్ సిబ్బందికి ఎస్కార్గ్ వెళ్లిన భద్రతా జవాన్లు పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఈ జిల్లాలోని బింద్రానవగఢ్ నియోజకవర్గంలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది.
ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ తన నియోజకవర్గం పటాన్‌దుర్గ్‌లోని కురుద్ధి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి రాయపూర్‌లోని సివిల్ లైన్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 958 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.
ఎన్నికల సిబ్బంది అంతా మహిళలే
ఎన్నికల నిర్వహణలో అతివలు సత్తా చాటారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ బూత్‌లలో పూర్తిగా మహిళా బృందాలే విధులు నిర్వహించిన ఘటన దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
ఆ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రెండో, ఆఖరి విడత పోలింగ్‌లో రాయ్‌పూర్ (నార్త్) నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 201 పోలింగ్ బూత్‌లలో ఎన్నికల విధులన్నీ మహిళలే నిర్వహించారు. పురుషుల ప్రమేయం లేకుండా, అన్ని విభాగాలలో మహిళలే విధులు నిర్వహించారు. ఇది దేశంలోనే తొలిసారని ఎన్నికల సంఘం ప్రకటించింది.