ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు నేరుగా కీలక ప్రశ్న సంధించారు. తాను రాజీనామా చేయాలా? లేదా జైలు నుంచే పరిపాలన సాగించాలా? అని అడిగారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి పలువురు ఆప్ నేతలు ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. సిఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు విచారణలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో ఇప్పుడు తన తదుపరి చర్య గురించి పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. వెంటనే సిఎం పదవిని వదులుకుని, విచారణలను ఎదుర్కోవాలా? లేక జైలు పాలుచేయబడితే అక్కడి నుంచి పాలన సాగించాలా? అనేది తేల్చుకోనున్నట్లు వెల్లడించారు.
దీనికి తనకు ప్రజల నుంచి జవాబు కావాలని కోరారు. ప్రజలే అధికారం ఇచ్చారు. అధికార నిర్ణేతలు వారే అవుతారని స్పష్టం చేశారు. తనకు అధికారంపై మమకారం లేదని, తాను తొలుత పదవిలోకి వచ్చినప్పుడు కేవలం 49వ రోజునే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు.
తన రాజీనామాను ఎవరూ కోరలేదని, తన సొంత నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఏది ఏమైనా బిజెపి ఉచ్చులో చిక్కుకోరాదని స్పష్టం చేశారు. ఇక పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి తన రాజీనామా లేదా తన జైలు నుంచి పాలనపై వారి స్పందనను తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.
తాను జైలుకు వెళ్లినా వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీ నుంచి బిజెపికి ఒక్క సీటూ రాకుండా చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇక లిక్కర్ స్కామ్ ఢిల్లీలో లేదని, ఇది గుజరాత్లో ఉంది. హర్యానాలో ఉంది. దేశంలో అచిరకాలంలోనే ఆప్ మూడో అతి పెద్ద పార్టీగా నిలిచింది. బిజెపి, కాంగ్రెస్‌లను కూడా త్వరలోనే వెనకకు నెట్టివేస్తుంది. దీనిని గమనించే బిజెపి ఇప్పుడు ఆప్ పట్ల కుట్రకు పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీలో గెలవలేమని బిజెపికి తెలిసివచ్చింది. అందుకే ఈ షరాబీ గోటాలాకు దిగారు. ఇడి, సిబిఐలు సోదాలు దాడులకు దిగుతున్నాయి. ఎటువంటి సాక్షాధారాలు లేకుండానే ఇటువంటి చర్యలకు ఏ విధంగా పాల్పడుతారని సుప్రీంకోర్టు కూడా నిలదీసిందని కేజ్రీవాల్ తెలిపారు.