ఉత్తరాకాండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ ఉత్తరాఖండ్‌కు వచ్చారు. సిల్కియారా టన్నెల్ వద్ద ఆయన ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు.
టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించనున్నట్లు ఆయన చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ బాగానే సాగుతోందని, తమ బృందం మొత్తం ఇక్కడే ఉందని, సమస్యకు పరిష్కారాన్ని చూపనున్నట్లు చెప్పారు. ఇక్కడ చాలా పని జరుగుతోందని, చిక్కుకున్న కార్మికులే కాదు, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నవాళ్లు కూడా సురక్షితంగా ఉండాలని అర్నాల్డ్ తెలిపారు. ఆహారం, వైద్యం క్రమంగా అందుతోందని చెప్పారు.
టన్నెల్ కుప్పకూలిన ఘటన జరిగి నేటికి 9 రోజులు. టన్నెల్లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల ప్రాణాలు దక్కుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించినమేర ఫలించలేదు. దీంతో సోమవారం అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
9 రోజులు గడుస్తున్న వారిని బయటకి తీయలేకపోవడంతో టన్నెల్ బయట నిరీక్షిస్తున్న కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన అంతకంతకూ తీవ్రమవుతోంది. టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సజీవంగా ఉండేందుకు మల్టీవిటమిన్లు, యాంటిడిప్రెసెంట్స్, డ్రై ఫ్రూట్స్ పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు.
అమెరికాకు చెందిన ఆగర్ యంత్రం, డ్రిల్ చేస్తూ శిథిలాల గుండా పైపులను నెడుతోంది. కార్మికులు బయటపడేందుకు మరో మార్గాన్ని సిద్ధం చేస్తోంది. శుక్రవారం డ్రిల్లింగ్ నిలిపేసే సమయానికి ఆగర్ యంత్రం 40 మీటర్ల శిథిలాల ద్వారా డ్రిల్లింగ్ చేసి.. సొరంగం లోపల 60 మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించింది. ఆరు అంగుళాల వ్యాసం కలిగిన పైపు ఇంకా కార్మికులకు చేరలేదు, ఇది వారికి సరైన ఆహారాన్ని అందజేస్తుంది.
కార్మికులను రక్షించేందుకు జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారిని క్షేమంగా బయటకి తీసుకొస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు. కార్మికులకు ధైర్యాన్ని అందించాలని కోరారు.
కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్ని ముమ్మరం చేశామని ధామీ చెప్పారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్‌లో భాగం.