అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ ఆలయంలో రాముడి విగ్రహ వేడుకను చూసేందుకు ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. రామయ్య విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం సమీపిస్తుండడంతో ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు ఎన్నో కానుకలను సమర్పించారు.
శతాబ్దాల తరబడి సంఘర్షణల అనంతరం ఈ రామమందిర నిర్మాణాన్ని పూర్తిచేస్తున్నారు. ఇప్పడు రాముని విగ్రహ ప్రతిష్టాపనలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు యూపీ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ శ్రీరాముని వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. దేశమంతా వీక్షించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే రామయ్య విగ్రహ ప్రతిష్టాపనకు ముహుర్తాన్ని కూడా ఖరారు చేశారు. కేంద్రప్రభుత్వం చెప్పిన సమయానికే ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఏడాది చివరినాటికి రామమందిర నిర్మాణం పూర్తిచేస్తామని, 2024 జనవరిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిపిస్తామని కేంద్రప్రభుత్వం మాట ఇచ్చింది.
ఆ మాట ప్రకారమే మరికొన్ని రోజుల్లో అయోధ్య శ్రీరాముని దర్శనానికి భక్తులు బారులుతీరనున్నారు. ఇందులో భాగంగానే జనవరి 22 మధ్యాహ్నా 12.20 గంటలకు మృగశిర నక్షత్రంలోని అభిజీత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయనున్నారు.
ఈ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను నాలుగు దశల్లో చేయనున్నారు. మొదటి దశలో కార్యాచరణ సిద్ధం చేయగా, రెండో దశలో పది కోట్ల కుటుంబాలకు రామయ్య అక్షింతలు, రాంలాల చిత్రం, కరపత్రం అందజేయనున్నారు. ఇక, మూడో దశలో జనవరి 22న దేశ వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నాల్గొ దశలో జనవరి 26 నుంచి భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం కల్పించడం జరుగుతుంది.