ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఆదివారం నాడు తూప్రాన్‌లో ఎన్నికల ప్రచార బహిరంగసభలో మాట్లాడుతూ గజ్వేల్‌లో పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను చూసి కేసీఆర్ భయపడ్డారని చెప్పారు.‘‘తెలంగాణ ఈసారి ఓ కొత్త సంకల్పం కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని సంకల్పం మొదలైంది” అని చెప్పారు.
భూ నిర్వాసితులను రోడ్డునపడేసిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. సచివాలయానికి రాని సీఎం అవసరమా? ఫాంహౌస్‌లో ఉండే సీఎం మనకు అవసరమా? అంటూ నిలదీశారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ వారసత్వ రాజకీయాలతో వ్యవస్థ నాశనమైందని మండిపడుతూ కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటే అని స్పష్టం చేశారు. ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని ప్రజలను హెచ్చరించారు. బీసీల్లో ప్రతిభావంతులకు న్యాయం జరగడం లేదని పేర్కొంటూ సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం అని ప్రధాని మోదీ తెలిపారు.
తెలంగాణలో దోచుకున్న కేసీఆర్ ఇప్పుడు దేశంపై పడ్డారని చెబుతూ దేశంలో లూటీ చేసేందుకు దిల్లీలో ఒక నేతతో చేతులు కలిపారని ప్రధాని విమర్శించారు. దిల్లీ నేతలతో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారని పేర్కొంటూ కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై దర్యప్తు కొనసాగుతోందని మోదీ తెలిపారు.
దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడ్డాయని మోదీ ఆరోపించారు. తెలంగాణ నిధులన్నీ కేసీఆర్ కుటుంబానికి వెళ్లాయని చెబుతూ నీళ్ల పేరుతో నిధులన్నీ కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. పేపర్ల లీక్ తో నియామకాలు ఆగిపోయాయని చెప్పారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల వల్ల వ్యవస్థలు నాశనం అయ్యాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ రెండు కుటుంబ పార్టీలు తమ వారసుల గురించి మాత్రమే ఆలోచిస్తాయని ఆరోపించారు. బీసీల్లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా వాళ్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అందుకే తెలంగాణలో బీసీని సీఎంను చేస్తామని బీజేపీ ప్రకటించిందని తెలిపారు.