చైనాలో తీవ్రస్థాయి న్యూమోనియా నేపథ్యంలో రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని కేంద్రం అప్రమత్తం చేసింది. ఎక్కడైనా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఉంటే వెంటనే వాటిపై నివారణ చర్యలు ఉధృతం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉత్తర చైనాలో ఇప్పుడు పిల్లల్లో తలెత్తిన న్యూమోనియా వైరస్ కారకం అనే వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోలన కలిగిస్తున్నది. చైనా వైరస్ దశలో రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ప్రజా ఆరోగ్య, చికిత్సల పరిస్థితిని సమీక్షించుకుంటూ, సన్నద్ధతతను పెంపొందించుకోవల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం అధికారిక ప్రకటన వెలువరించింది.
ఇప్పటికిప్పుడు చైనా న్యూమోనియాతో భారతదేశానికి పెద్దగా ముప్పేమీ లేదని వైద్య ప్రముఖులు తెలిపారు. కానీ ఎటువంటి ఉపేక్ష అయినా అది పరిస్థితిని విషమింపచేస్తుందని హెచ్చరించారు. దీనితో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. అత్యంత ఆద్యంత జాగ్రత్త చర్యలలో భాగంగా కేంద్రం వివిధ స్థాయిల్లో వైరస్ ముప్పు తట్టుకునే ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించుకుంటుందని, రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరిస్తుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే అలసత్వం పనికిరాదని ప్రకటనలో స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తరఫున అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ లేఖలు పంపించారు. ప్రజా ఆరోగ్య పంపిణీ వ్యవస్థ గురించి, ఆసుపత్రుల సన్నద్ధత గురించి సమీక్షించుకుంటూ , తగు విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
అవసరమైన రీతిలో బెడ్స్, శ్వాసకోశ వ్యాధుల ఔషధాలు, వ్యాక్సిన్లు సిద్ధం చేసుకోవాలి. యాంటీబయాటిక్స్ తగు విధంగా నిల్వ ఉంచుకోవాలి. మాస్కుల వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను వాడాలి. టెస్టింగ్ కిట్స్ ద్వారా ఇంఫ్లూయెంజా వైరస్ లక్షణాలను ముందుగానే పసికట్టాల్సి ఉంటుంది. దీని వల్ల ఇది ఎక్కువగా వ్యాపించకుండా నివారణకు దిగవచ్చు. రీఏజెంట్లు, ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరు, వెంటిలేటర్లు , ఇన్ఫెక్షన్ కంట్రోలు విధానాలను సమీక్షంచాల్సి ఉంటుందని లేఖలలో తెలిపారు.