భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభలు, కోర్టుల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా పార్లమెంట్ లో 400 మంది సిబ్బందికి, సుప్రీం కోర్ట్ లో నలుగురు న్యాయమూర్తులకు కరోనా అని తేలడంతో మొత్తం 150 మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు
సుమారు 400మందికి పైగా పార్లమెంట్ సిబ్బంది కరోనా బారినపడినట్లు అధికారులు తెలిపారు. జనవరి 4 నుండి 8 తేదీల మధ్య ఈ కేసులు వెలుగు చూశాయని అన్నారు. వచ్చే నెలలో పార్లమెంట్ బట్జెట్ సమావేశాలు జరగనున్న తరుణంలో కరోనా మహమ్మారి ఆందోళనకు గురిచేస్తున్నది.
పార్లమెంటులోని 1,409 సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 402 మందికి పాజిటివ్‌గా నిర్థారణైందని, వేరియంట్ నిర్థారణ కోసం వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని పేర్కొన్నారు. కరోనా బారినపడ్డ ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనల్ని పాటించాలని అంతర్గతంగా సిబ్బందికి సందేశం పంపినట్లు సమాచారం.
పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 200 మంది లోక్‌సభ సిబ్బంది, 69 మంది రాజ్యసభ, 133 మంది అనుబంధ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వీరితో కాంటాక్ట్‌లోకి వచ్చిన పలువురు ఉన్నతస్థాయి అధికారులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
సుప్రీం కోర్ట్ లో కరోనా బెడద
సుప్రీంకోర్టులో చీఫ్ జస్టీస్ సహా మొత్తం 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో నలుగురికి వైరస్ సోకడంతో కోర్టులో పాజిటివిటీ రేటు 12.5 శాతం పెరిగింది. సుప్రీంకోర్టు అధికారిక సమాచారం ప్రకారం.. జ్వరం బాధపడుతున్న ఓ న్యాయమూర్తి .. జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫేర్ వెల్ పార్టీకి హాజరయ్యారు. ఆ తర్వాత ఆ న్యాయమూర్తి కోవిడ్ బారిన పడ్డారు.
కరోనా వైరస్ పరిస్థితిపై గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సమావేశమయ్యారు. “దురదృష్టవశాత్తూ, మళ్లీ సమస్య మొదలైంది. మేం కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. వచ్చే నాలుగు నుండి ఆరు వారాల వరకు మేము ఫిజికల్ మోడ్ ద్వారా కేసులను వినలేకపోవచ్చు” అని సిజెఐ చెప్పారు.
రెండు వారాల పాటు వర్చువల్ విచారణలు చేపడతామని పేర్కొంది. జనవరి 7 నుంచి ఈ నిబంధనలు జారీ చేశారు. అత్యంత అత్యవసరమైన అంశాలు, తాజా విషయాలు, బెయిల్ వ్యవహారాలు, స్టే, డిటెన్షన్ వ్యవహారాలు, నిర్ణీత తేదీ వ్యవహారాలు మాత్రమే కోర్టు చేపడుతుందని పేర్కొన్నారు.
మార్చి 2020 నుంచి కరోనా కారణంగా సుప్రీం కోర్టు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కేసులు కాస్త తగ్గడంతో అక్టోబర్ నుంచి భౌతిక విచారణలు చేపట్టింది. ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండటంతో కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తామని కోర్టు తెలిపింది. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ (డిడిఎంఎ) ఆదేశాల ప్రకారం..అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలని ఆంక్షలు విధించింది. మిగిలిన సిబ్బందికి వర్క్‌ఫ్రం హోం అనుమతించాలని తెలిపింది.
మరోవైపు, భారత్ లో మూడు రోజులుగా కరోనా కేసులు లక్ష దాటుతున్నాయి. తాజాగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 327 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,90,611 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 10.21 శాతంగా ఉంది.