* సిరీస్ 3-1తో కైవసం స్పిన్నర్ అక్షర్ పటేల్‌కి తోడు రవి బిష్ణోరు బౌలింగ్‌లో రాణించడంతో భారతజట్టు 20పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. భారత్ నిర్దేశించిన 175పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగల్గింది.
స్పిన్నర్ అక్షర్ పటేల్(3/16), బిష్ణోరు(1/17) పొదుపు గా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. తొలుత రింకు సింగ్(46), జైస్వాల్(37), గైక్వాడ్(32) బ్యాటింగ్‌లో రాణించడంతో భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174పరుగులు చేసింది.
రింకూ సింగ్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు, వికెట్ కీపర్ జితేశ్ శర్మ 19 బంతుల్లో ఫోర్, 3 సిక్సులతో 35 పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ (8), సూర్యకుమార్ యాదవ్ (1) నిరాశపరిచారు. 4వికెట్ల నష్టానికి 167పరుగులతో పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఏడు పరుగుల వ్యత్యాసంలో ఐదు వికెట్లు కోల్పోయింది.
ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్ష్స్కు మూడు, బెహ్రెన్ డార్ఫ్, సంఘాకు రెండేసి, ఆరోన్ హార్డీకి ఒక వికెట్ దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 3ఓవర్లలోనే 40పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఆ దశలో స్పిన్నర్ రవి బిష్ణోరు… ఫిలిప్‌ను బౌల్డ్చేసి తొలి బ్రేక్ ఇచ్చాడు.
ఆ తర్వాత అక్షర్ రాణించడంతో ఆసీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మాధ్యూ వేడ్(36నాటౌట్), హెడ్(31) టాప్ స్కోరర్స్. అక్షర్‌కు మూడు, దీపక్ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అక్షర్ పటేల్‌కు దక్కగా… ఐదో, చివరి టి20 బెంగళూరు వేదికగా ఆదివారం జరగనుంది.