పార్లమెంట్ లైబ్రరీ భవన్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి 23 పార్టీల నుంచి 30 మంది నేతలు హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష నేతలతో కేంద్రం చర్చించింది. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టే బిల్లుల వివరాలు అఖిలపక్ష నేతలకు కేంద్రం అందించింది.
ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై నిర్మాణాత్మక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, బిజెపియేతర రాష్ట్రాల పట్ల ఆర్థిక వివక్షపై సవివరంగా చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయి.
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌కి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు హిందీలో పేర్లు పెట్టడంపై అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఐపిసికి బదులుగా భారతీయ న్యాయ సంహిత, సిఆర్‌పిసికి బదులుగా భారతీయ సివిల్ ప్రొటెక్షన్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్‌కు బదులుగా భారతీయ సాక్ష్యా అధినియం అని పేరు పెట్టారు.
డిసెంబర్ 4 నుంచి 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు సాగనున్న ఈ సెషన్ లో 15 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఈ సమావేశంలో పాల్గొనగా, కాంగ్రెస్ తరపున జైరాం రమేష్, ప్రమోద్ తివారీ, గౌరవ్ గొగోరు, టిఎంసి నుంచి సుదీప్ బంద్యోపాధ్యాయ, డెరెక్ ఓ’బ్రియన్, డిఎంకె ఎంపి విల్సన్, జెఎంఎం నుంచి మహువా మజీ, ఎస్పి నుంచి ఎస్టి హసన్, బిఎస్పీ ఎంపి గిరీష్ చంద్ర, జెడియు నేత దిలేశ్వర్ కామత్, ఎన్సీపీ ఎంపి ఫౌజియా ఖాన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి ఎన్ డి గుప్తా, సిపిఎం ఎంపి ఎలమరం కరీం, సంతోష్ కుమార్ (సిపిఐ), అగాథా సంగ్మా (ఎన్‌పిపి), ఎన్ కె ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పి), నామా నాగేశ్వరరావు (బిఆర్ఎస్), కనకమేడల రవీంద్ర కుమార్ (టిడిపి) తదితరులు హాజరయ్యారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 21 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. అందులో 19 సాధారణ బిల్లులు కాగా, రెండు ఆర్ధిక బిల్లులు ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహితా బిల్లు 2023, భారతీయ సాక్ష్యా బిల్లు 2023 బిల్లు, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, మహిళా రిజర్వేషన్ చట్టంలోని నిబంధనలను జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరికి విస్తరించడానికి రెండు, సెంట్రల్ యూనివర్శిటీ సవరణ బిల్లు, పోస్టాఫీసు సవరణ బిల్లు, రాజ్యసభలో ఆమోదం పొందిన అడ్వకేట్స్ (సవరణ) బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ బిల్లులను జాబితా చేసింది.