మిజోరాం లో మాజీ ఐపీఎస్ అధికారి 74 ఏళ్ల లాల్ దహోమా జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్‌పీఎమ్) మొత్తం 40 సీట్లలో 27 సీట్లను గెల్చుకొని అధికారం చేబట్టనుంది. అధికార మిజో నేషనల్ ఫ్రెంట్ (ఎమ్ఎన్ఎఫ్) అత్యంత దారుణంగా ఓటమి పాలైంది. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జోరంథంగ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఎమ్ఎన్ఎఫ్లో చాలా మంది అభ్యర్థులు తమ డిపాజిట్లను కూడా కోల్పోయారు.
మెజారిటీకి కావాల్సిన సీట్లు 21. మ్యాజిక్ ఫిగర్‌ని ఆరు పార్టీల విపక్ష కూటమి జెడ్పీఎం (జోరం పీపుల్స్ మూవ్మెంట్) సునాయాసంగా అందుకుంది. అధికార పక్షం ఎమ్ఎన్ఎఫ్ 10 సీట్లకు పరిమితమైంది. జాతీయ పార్టీలైన బిజెపి 2, కాంగ్రెస్ 1 సీట్లకు పరిమితమయ్యాయి.
ఈ దఫా ఎన్నికల్లో ఎమ్ఎన్ఎఫ్, జెడ్పీఎంలు, కాంగ్రెస్ పార్టీలు 40 సీట్లల్లో పోటీ చేశాయి. బీజేపీ కేవలం 13 చోట్ల బరిలో దిగింది. జాతీయ పార్టీగా శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న ఆమ్ ఆద్మీ పార్ తొలిసారిగా మిజోరంలో పోటీ చేసింది. నాలుగు చోట్ల తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొత్తం 17 మంది స్వతంత్రులు సైతం పోటీ చేశారు.
2018 ఎన్నికల్లో ఎమ్ఎన్ఎఫ్కు 26 సీట్లు వచ్చాయి. జెడ్పీఎంకు 8 స్థానాల్లో విజయం వరించింది. కాంగ్రెస్ 5 చోట్ల, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరం కౌంటింగ్ కూడా జరగాల్సి ఉంది. అయితే క్రైస్తవులు అధికంగా ఉన్న మిజోరంలో ఆదివారం సామూహిక ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి కౌంటింగ్ తేదీ మార్చాలని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు కోరాయి. దాంతో మిజోరంలో కౌంటింగ్‌ను ఎలక్షన్ కమిషన్ సోమవారానికి వాయిదా వేసింది