తెలంగాణలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. హైదరాబాద్ లోని ఎల్లా హోటల్లో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏల సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎంపిక చేసే అధికారం అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అయితే, సాయంత్రం వరకు అధిష్టానం నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పాటు ఎఐసిసి తరపున హాజరైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో పాటు, ఇతర పరిశీలకులను తక్షణమే ఢిల్లీకి రావాలని ఆదేశాలు అందాయి. దీంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
అధిష్టానంతో చర్చల అనంతరం మంగళవారం తుది నిర్ణయం వెలువడుతుందని, గురువారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో మంచి రోజులు కావని కూడా చెబుతున్నారు. అప్పటికి కూడా ఖరారు కాకపోతే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన విధంగా 9న (సోనియాగాంధీ జన్మదినం) న ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం.
కర్ణాటకలో యడ్యూరప్ప, డికె శివకుమార్ మధ్య చోటుచేసుకున్న గ్రూపు రాజకీయాల కారణంగా శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడానికి దాదాపు వారం రోజుల సమయం పట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ ఆ తరహా పరిణామాలే చోటుచేసుకుంటున్నట్టుగా సమాచారం.
వాస్తవానికి నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారైనట్టు సోమవారం ఉదయం నుండి విస్తృతంగా ప్రచారమైంది. గవర్నర్ కార్యాలయానికి కూడా సమాచారం వెళ్లడంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. పోలీస్ హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దీంతో ఎంఎల్ఏల సమావేశం లాంఛనమే అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే, కాంగ్రెస్‌లో మరోరకమైన పరిణామలు చోటుచేసుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే ఎంఎల్ఏలు అందరూ ఎల్లా హోటల్‌కు చేరుకున్నప్పటికీ సమావేశం ప్రారంభం కాలేదు.
ఎంఎల్ఏలు ఎదురుచూస్తుండగా డికె శివకుమార్ పార్క్ హయత్ హోటల్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి సోదరులతో సమావేశమైనారు. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొనలేదు.
ఈ సమావేశం జరుగుతుండగానే ఎఐసిసి పరిశీలకులు ఎల్లా హోటల్లో ఎంఎల్ఏలను విడివిడిగా కలిసి అభిప్రాయాలు సేకరించారు. ఆ తరువాత జరిగిన సిఎల్పి సమావేశంలో అధ్యక్షుడు ఖర్గేకు సిఎల్పినేతను నియమించే బాధ్యతను అప్పగిస్తున్నట్లు ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపారు.
నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న సమయంలో శివకుమార్‌తో పాటు పరిశీలకులను ఢిల్లీకి తక్షణమే రావాలంటూ ఆదేశాలు అందాయి. పార్లమెంటు సమావేశాల కారణంగా ఖర్గే ఈ వ్యవహారంపై సోమవారం దృష్టి సారించలేదని చెబుతున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగాల్సిఉంది. దాని తరువాత తెలంగాణ వ్యవహారంపై దృష్టి సారిస్తారని, ముఖ్యమంత్రితో పాటు, మంత్రి వర్గాన్ని కూడా ఖరారు చేస్తారని చెబుతున్నారు.