బుధవారం ఢిల్లీలో జరుగవలసి ఉన్న ఇండియా కూటమి సమావేశం వాయిదా పడింది. కీలక నేతలు అందుబాటులో లేకపోవడం వల్ల సమావేశం వాయిదా పడినట్టు కూటమి వర్గాలు తెలిపాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించాలని భావించారు.
అయితే సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు ముందస్తు షెడ్యూల్ కారణంగా హాజరుకావడం లేదు. దీంతో ఇండియా కూటమి సమావేశాన్ని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా ఎలయెన్స్ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం 6వ తేదీన జరపాలని నిర్ణయించారు. దీని తర్వాత డిసెంబర్లోనే అందరికీ ఆమోదయోగ్యమైన తేదీలో విష పాపక్ర్టీల అధ్యక్షులు, ఇండియన్ అలయెన్స్ అధినేతల సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు.
కాగా, ఇండియా కూటమి సమావేశానికి తమ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యే ఆలోచన ఏదీ లేదని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి ప్రకటించారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ కానీ, మరో నేత కానీ వెళ్లే అవకాశం ఉందన్నారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా? అని అడిగినప్పుడు, ఇండియా కూటమి సమావేశం గురించి తమకు ముందస్తు సమాచారం లేదని ఆయన సమాధానమిచ్చారు.
మరోవైపు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తనకు డిసెంబర్ 6న కోల్కతాలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున కూటమి సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్టు చెప్పారు. తమకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే కోల్కతా సమవేశాన్ని మార్చుకునే ఉండేవాళ్లమని తెలిపారు.
విపక్ష పార్టీల నేతలను స్వయంగా కలుసుకుని ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం డిసెంబర్ 6వ తేదీ సమావేశానికి ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బిజీగా ఉందని నితీష్ ఇటీవల విమర్శించారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ లలో కాంగ్రెస్ ఓటమి కారణంగా ప్రాంతీయ పార్టీలు ముఖం చాటేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవాలనే ప్రయత్నాలకు కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలు అడ్డంకిగా ఉన్నట్లు ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు.
కాంగ్రెస్ అనాసక్త ధోరణి కారణంగా గత మూడు నెలలుగా కూటమి సమావేశాలు జరగలేదు. నెల రోజుల లోపుగా రాస్త్రాలలో పొత్తుల విషయం తేల్చాలని ముంబై భేటీలో నిర్ణయించినా ఆ దిశలో ముందడుగు వేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఇటీవల మూడు ఎన్నికలు జరిగిన మూడు రాస్త్రాలలో చిన్న చిన్న పార్టీలతో పొత్తు పట్ల కాంగ్రెస్ ఆసక్తి చూపక పోవడం ఆయా పార్టీలలో ఆగ్రవేశాలు కలిగిస్తున్నాయి.
కాంగ్రెస్ అహంకార ధోరణి కారణంగానే ఈ ఎన్నికలలో ఆ పార్టీ ఓటమి చెందిన్నట్లు శివసేన (ఉద్ధవ్), ఎస్పీ, టిఎంసి తదితర పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఆప్ సహితం ఇప్పుడు ఈ కూటమి పట్ల ఆసక్తి చూపడం లేదు.