తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనపై రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్టు అధిష్ఠాన నిర్ణయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా ముందు ప్రకటించారు.
రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా ప్రకటించిన అధిష్ఠానం డిసెంబరు 7న ఆయన ప్రమాణం స్వీకారం చేస్తారని తెలిపింది. అయిత రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ప్రకటన వెలువడే కంటే కొద్ది సమయం ముందే రేవంత్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు రావటంతో హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి అధిక్య ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై అధిష్ఠానం ఫలితాలు వెలువడిన నాటి నుంచి కసరత్తు చేస్తోంది. నిన్న గాంధీ భవన్లో సీఎల్పీ మీటింగ్ జరగ్గా సీఎల్పీ నేత ఎంపిక విషయం పూర్తిగా అధిష్ఠానానికే అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసి ఏఐసీసీకి పపించిన విషయం తెలిసిందే.
తర్వాత ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా డీకే శివకుమార్ మాట్లాడి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుని, వాటి ఆధారంగా తయారు చేసిన నివేదికను కూడా అధిష్ఠానానికి పంపించారు. ఆ తర్వాత పరిశీలకులు కూడా ఢిల్లీకి వెళ్లి అగ్రనేతలతో భేటీ అయ్యారు. సుమారు 50 మంది ఎమ్యెల్యేలు రేవంత్ రెడ్డి పేరుకు మద్దతు ప్రకటించారని తెలుస్తున్నది.
అయితే కొందరు సీనియర్ నేతలు ఏకీభవించకపోవటంతో ఈ విషయంపై కాస్త కసరత్తు జరిగింది. ఈరోజు ఉదయంమే సాయంత్రం లోగా తమ అభ్యర్థిని ప్రకటిస్తామంటూ అంటూ తెలంగాణ సీఎం అభ్యర్థి ప్రకటనపై మల్లిఖార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. మరోవైపు సీఎం రేసులో ఉన్న టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకొని చివరి ప్రయత్నాలు చేశారు.
ఇదిలా ఉండగా.. కర్ణాటక డిప్యూటీ సీఎం, తెలంగాణ పరిశీలకుడు డీకే శివ కుమార్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు.. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ సమావేశమై చర్చించారు. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించటంతో పాటు ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే మిగతా సీనియర్లు నేతలు చేస్తున్న డిమాండ్లపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. అగ్రనేతల భేటీ అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారు.