తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్‌తో గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ ఆయనచేత ప్రమాణం చేయించారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడికి కుటుంబ సమేతంగా వెళ్లిన రేవంత్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. మర్గమధ్యలో గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రిగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు చేత మంత్రులుగా గవర్నర్ ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుక్విందర్ సుఖు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనకు కంగ్రాట్స్ తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తున్నట్లు ప్రధాని తన ట్వీట్లో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వంత్ రెడ్ సీఎం హోదాలో తొలి ప్రసంగం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఆశామాషీగా ఏర్పడలేదని, ఎందరో ఉద్యమకారుల పోరాటాలు, త్యాగాల సాక్షిగా ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ సమిధగా మారి తెలంగాణను ఇచ్చిందని డి పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో గత పదేళ్లుగా ప్రజాస్వామ్యం హత్య చేయబడిందని.. ప్రజల గోడు వినిపించుకునే వాళ్లు లేక తెలంగాణ మౌనంగా బాధ భరించిందంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రగతిభవన్‌ను గడీగా మార్చుకుని పాలన సాగించారంటూ గత సర్కారుపై దుమ్మెత్తిపోశారు. చివరికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అభివర్ణించారు.
ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు నిష్పక్షపాతంగా అభివృద్ధి చెందుతాయని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటు.. సీఎంగా తాను ప్రమాణం చేస్తుంటే.. అటు ప్రగతి భవన్ చుట్టూ వేసి కంచెను బద్దలు కొట్టించామంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక నుంచి ప్రగతి భవన్ కాదని.. జోతిరావుపూలే ప్రజాభవన్ అని తెలిపారు. ప్రజాభవన్‌కు ప్రజలు ఎప్పుడంటే అప్పుడు నిరంభ్యంతరంగా ఎవరైనా రావచ్చని స్పష్టం చేశారు.
తెలంగాణను అభివృద్ది పథంలో నడిపించేందుకు తమ విలువైన సూచనలు, సలహాలు అందించొచ్చని స్పష్టం చేశారు. శుక్రవారం రోజున జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెబుతూ నాలుగు కోట్ల ప్రజలకు అందులో ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, నిరుద్వోగులకు న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తాము పాలకులం కాదని.. సేవకులమని.. అందుకే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. మాట ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి మర్గంతో తెలంగాణలోని నలువైపులా సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ మేటి నగరాలతో పోటీ పడేలా.. శాంతి భద్రతలను కాపాడుతూ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ప్రసంగం అనంతరం.. సీఎం హోదాలో రెండు ఫైళ్లపై రేవంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు.. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఆరు గ్యారెంటీల ఫైలుపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన వెంటనే మొదటి ఉద్యోగం ఇస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. దివ్యాంగురాలైన రజినికి వేదికపైనే ఉద్యోగ నియామక పత్రం అదించారు.