లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతామని స్పీకర్ ఓం బిర్లా ఎంపిలకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపిలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. బుధవారం పార్లమెంటులోకి ఇద్దరు ఆగంతకులు చొరబడిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. లోక్‌సభ లోపల ఇద్దరు ఆగంతకులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామని చెప్పారు.
నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే, నిందితులు వదిలిన గ్యాస్ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. దీనిపై ప్రతిపక్ష ఎంపిలందరితోనూ ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తామని, సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు కలకలం సృష్టించారు. సందర్శకులు కూర్చునే గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ వద్ద ఒక రకమైన పొగను వదిలిపెట్టాడు. అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల మరో ఇద్దరు పసుపు రంగు పొగను వదిలారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఈ నలుగుర్ని అరెస్టు చేశారు.
లోక్‌సభలోకి చొరబడిన వారు సాగర్ శర్మ (20), మనోరంజన్ (35) కాగా, పార్లమెంటు ఎదుట ఆందోళన చేపట్టిన వారిని నీలమ్ (42), అమోల్ షిండే (25)లుగా గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా తెలిపారు. మనోరంజన్ మైసూర్‌కి చెందిన వారని, కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని తెలిపారు. మరొకరు హర్యానాలోని హిస్సార్కి చెందినవారని చెప్పారు. కర్ణాటక బిజెపి ఎంపి ప్రతాప్ సిన్హా జారీ చేసిన విజిటర్స్ పాస్‌తో సాగర్ శర్మ పార్లమెంటులోకి ప్రవేశించడం గమనార్హం.
ఢిల్లీ పోలీసులు ఉపా కేసు నమోదు..!
పార్లమెంట్ భద్రతా లోపం వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో ఒకరు బెంచీలపైకి ఎక్కి ‘నిరంకుశత్వం నశించాలి’ అని నినదించారు.
ఈ ఘటనతో పార్లమెంట్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితులు లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకి రంగు పొగను వదలడంతో ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. పలువురు వేగంగా స్పందించి నిందితుల్లో ఒకరిని పట్టుకొని చితకబాది మార్షల్స్‌కు అప్పగించారు. మరో వైపు నీలందేవి, అమోల్ షిండే పార్లమెంట్ భవనం వెలుపల సైతం పసుపు, ఎరుపు రంగు పొగను వదులుతూ నినాదాలు చేశారు.
అనంతరం భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కుట్రలో లలిత్, విశాల్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులు సైతం భాగమయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో విశాల్‌ను అదుపులోకి తీసుకోగా.. లలిత్ పరారీలో ఉన్నాడు.
ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి షిండే మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని తన గ్రామం నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హర్యానాకు చెందిన నీలందేవితో కలిసి పార్లమెంట్ వెలుపల ‘నియంతృత్వం పనిచేయదు’.. భారత్ మాతా కీ జై’, జై భీమ్.. జై భారత్’ అంటూ నినదించారు.
ఆరుగురు వ్యక్తులు కలిసి సోషల్ మీడియా ద్వారా ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారని.. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన కుట్ర అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. నిందితులు రెండురోజుల కిందట ప్లాన్ చేశారని.. బుధవారం పార్లమెంట్‌లోకి చేరుకోక ముందు రెక్కీ నిర్వహించారన్నారు. ఆరుగురిలో ఐదుగురు పార్లమెంట్‌కు రాక ముందు గురుగ్రామ్‌లోని విశాల్ నివాసంలో బస చేశారని తెలిపాయి. పథకం ప్రకారం ఆరుగురు పార్లమెంట్ లోపలికి వెళ్లాలనుకున్నా ఇద్దరికి మాత్రమే పాస్‌లు వచ్చాయని పోలీసు వర్గాలు వివరించాయి.