వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ హాజరు ముఖ్యఅతిధిగా కానున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను అంతకుముందు ఆహ్వానించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. కానీ పలు కారణాల వల్ల ఈ గణతంత్ర దినోత్సవ వేడులకు హాజరు కాలేనని జో బైడెన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మేక్రాన్‌ను ఆహ్వానించినట్లు సమాచారం.
ఈ ఏడాది జులైలో పారిస్ వేదికగా జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ వేదికగా ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో ఇమ్మాన్యూయేల్ మేక్రాన్ పాల్గొన్నారు.
భారత్ ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిగాయని ఆ సమయంలో ఇమ్మాన్యూయేల్ మేక్రాన్ తెలిపారు. బాస్టిల్ డే పరేడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావించారని మేక్రాన్ పేర్కొన్నారు. మరోవైపు, 2023 గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్‌సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.