రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, ఢిల్లిలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని, చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకోవడం విషయంపై దృష్టి సారించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్తా, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలని అమిత్ షాను సీఎం కోరారు.
తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని, జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కోరారు.
ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం గురవారం సాయంత్రం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారు. రేవంత్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామి ఇచ్చారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 శాతం నిధులు
కాగా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరవు, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి సాగు నీరు ఇవ్వాల్సి ఉందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు నుంచి ఆరు జిల్లాల పరిధిలోని 1226 గ్రామాలతో పాటు హైదరాబాద్ మహా నగరానికి తాగు నీరు సరఫరా చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. సీఎం విజ్ఞప్తి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని, ఈ విధానం ప్రస్తుతం అమలులో లేదని చెప్పారు. అయితే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు తమ శాఖ పరిధిలోని మరో పథకం కింద 60 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
హైదరారాబాద్ అభివృద్ధికి నిధులివ్వండి
మరోవంక, హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను (బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీ నగర్, 26 కి.మీ., రూ.9,100 కోట్ల అంచనా వ్యయం), (విమానాశ్రయం మెట్రో కారిడార్- రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కి.మీ, రూ.6,250 కోట్ల అంచనా వ్యయం) సవరించాల్సి ఉందని తెలిపారు.
సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిగణించాలని కోరారు. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్దికి అవసరమైన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వాటిని ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు.