గతేడాది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వాల్సిన తరుణంలో ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. స్కిల్ కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టు, రిమాండ్ కు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని వాదిస్తూ గతంలో ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు.. హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే దీనిపై గతేడాదే విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును మాత్రం సుదీర్ఘంగా రిజర్వు చేసింది. ఇవాళ తీర్పు వెలువరించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు బెంచ్ లో జస్టిస్ బేలా త్రివేదీ తీర్పులో తెలిపారు. అలాగే ట్రయల్ కోర్టు (విజయవాడ ఏసీబీ కోర్టు ) నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కూడా తెలిపారు.
కానీ మరో న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబును సీఐడీ అరెస్టు, దిగువ కోర్టు రిమాండ్ విధించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుపై ఎలాంటి తీర్పూ ఇవ్వలేదు. చివరికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
అయితే చంద్రబాబును అరెస్టు చేయడం, రిమాండ్ కు పంపడం విషయంలో మాత్రం ఇద్దరూ జడ్డీలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సక్రమమేనని చెప్పినట్లయింది. మరోవైపు చంద్రబాబు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని పేర్కొన్న జస్టిస్ అనిరుద్ధ బోస్17 ఏ ప్రకారం చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇప్పుడైనా తీసుకోవచ్చని తెలిపారు. ముందస్తు అనుమతికీ, రిమాండ్ కూ మాత్రం సంబంధం లేదని చెప్పారు. అయితే సెక్షన్ 17ఏ అన్వయించే విషయంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.