కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్‌లో మార్పులు చేయడంతో పోలీసులు యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం రాహుల్ యాత్ర అస్సాంలోని జోర్హాట్ పట్టణంలో కొనసాగుతోంది. అయితే తాము ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి యాత్రను మళ్లించినట్లు అస్సాం పోలీసులు తెలిపారు. చార్ట్‌లో చూపించని మార్గాన్ని ఎంచుకున్నారని పేర్కొన్నారు. రూట్‌ను అకస్మాత్తుగా మార్చడం అంతరాయాలకు దారితీసినట్లు తెలిపారు.
యాత్ర నిర్వాహకులు, సహ నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్లను బద్దలు కొట్టేలా అక్కడి సమూహాన్ని ప్రేరేపించారని ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై కూడా దాడి చేసినట్లు తెలిపారు.
కాగా, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కాంగ్రెస్‌కు చెందిన అస్సాం ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా మండిపడ్డారు. ట్రాఫిక్ మళ్లింపు దగ్గర పోలీసులెవరూ లేరని చెప్పారు.
యాత్ర కోసం తమకు కేటాయించిన మార్గం చాలా ఇరుకుగా ఉందని, జనాలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడంతో కొన్ని మీటర్ల పాటు పక్కనున్న దారి గుండా ప్రయాణించాల్సి వచ్చిందని వివరించారు.
కాగా, తన సారథ్యంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ నాగాలాండ్ నుంచి అస్సాంలోని శివసాగర్ జిల్లాలో గురువారం ప్రవేశించగానే భారత్‌లో అత్యంత అవినీతికర ప్రభుత్వం అస్సాంలో పని చేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాలు ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్యాయాలు ఎదుర్కొంటున్నాయని చెబుతూ ఆ అంశాలు అన్నిటినీ యాత్రలో ప్రస్తావించగలనని స్పష్టం చేశారు.