అయోధ్యలో దివ్య రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22 వ తేదీన అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు భారీ స్థాయిలో జరుగుతున్న క్రమంలోనే కేంద్ర, రాష్ట్రాలకు చెందిన భద్రతా బలగాలు అయోధ్యలో ముమ్మరంగా గస్తీ కాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను యూపీ యాంటీ టెర్రరిజమ్ స్వ్కాడ్ పోలీసులు పట్టుకోవడం కలకలం రేపుతోంది.
అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు అనుమానితులను ఎస్ఏటీ పోలీసులు అరెస్టు చేసినట్లు యూపీ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
అయితే వారు ఏ ఉగ్రగ్రూప్‌నకు చెందినవారు అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. ఆ ముగ్గురు అనుమానితులను విచారణ చేస్తున్నట్లు వివరించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలో ఇప్పటికే వెయ్యికి పైగా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఏఐ టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో కూడిన 10 వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించేలా 4.5 కిలోమీటర్ల పరిధిలో డోమ్‌ను ఏర్పాటు చేశారు.
డ్రోన్లతో పాటు సుమారు 10 వేల మంది పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. 100 డీఎస్పీలు, 325 మంది ఇన్స్పెక్టర్లు, 800 మంది ఎస్ఐలు విధులు నిర్వర్తిస్తున్నారు.