టిఎంసి నేత మహువా మొయిత్రా అవినీతి ఆరోపణలపై మంగళవారం సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దేహద్రారుకి సిబిఐ సమన్లు జారీ చేసింది. గురువారం సిబిఐ ఎదుట విచారణకు హాజరుకావల్సిందిగా పేర్కొంది. నగదు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను అనుసరించి గతేడాది లోక్సభ నుండి మహువా మొయిత్రాను బహిష్కరించిన సంగతి తెలిసిందే.
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుండి మొయిత్రా రూ.2 కోట్ల నగదుతో పాటు ఖరీదైన బహుమతులను తీసుకున్నారని బిజెపి ఎంపి నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను దుబారు నుండి యాక్సెస్ చేశారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్ కమిటీ మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన నిషికాంత్ దూబే, న్యాయవాది దెహద్రారును కమిటీ విచారించింది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ క్రమంలోనే ఆమెను లోక్సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.