రైతాంగం ప్రయోజనాలకు కేంద్రం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ లేఖ వ్రాయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఆ లేఖలో కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చిఅబద్ధాలని ఎండగట్టారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డారు.
జీవో 317ను సవరించాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహోద్యమానికి శ్రీకారం చుడుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధానికి లేఖ పేరిట కొత్త డ్రామాకు తెరదీశారని సంజయ్ ఆరోపించారు. అందుకు సమాధానంగా ఆయన కేసీఆర్ కు మరో బహిరంగ లేఖ వ్రాసారు.
‘మీ విధానాలు, నిర్ణయాలతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది’ అంటూ ఆ లేఖలో కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ చేసిన అసంబద్ధ ప్రకటనల వల్ల ధాన్యం కుప్పలపై పడి 50 మందికిపైగా రైతులు ప్రాణా లొదిలారని అందులో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మూడేళ్లలో తెలంగాణలో ఎక్కడైనా ఒక్క రైతు పొలానికైనా కరెంట్ మీటర్లు బిగించినట్లు నిరూపించగలరా? ఒకవేళ మీరు నిరూపించకుంటే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? అంటూ ముఖ్యమంత్రికి బిజెపి నేత సవాల్ విసిరారు.
ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్న మీ అవినీతి బండారాన్ని బయటపెట్టి చర్యలు తీసుకు నేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో రైతుల పేరుతో లేఖలు రాయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. మీరెన్ని జిమ్మిక్కులు చేసినా, రాజకీయ డ్రామాలకు తెరలేపినా బీజేపీ ఆ ఉచ్చులో పడదని స్పష్టం చేశారు.
2017లో రైతులకు ఉచితంగా ఎరువుల సరఫరా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణమాఫీ, వడ్లు, పత్తి, మొక్కజొన్నసహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ప్రకటించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ వీటిని ఉగాదిలోగా నెరవేర్చకపోతే మరో మహోద్యమానికి శ్రీకారం చుడతామని సంజయ్ హెచ్చరించారు.