తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సత్కరించింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మ అవార్డులకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు.
వీరితో పాటు పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన తెలంగాణవాసులు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమా మహేశ్వరి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠాలాచార్యను కూడా సీఎంతో పాటు మంత్రులు సత్కరించారు. లంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఈ ఐదుగురికి పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్న తర్వాత కూడా చాలామంది పద్మ అవార్డు గ్రహీతలు, కళాకారులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగదు బహుమతి, పెన్షన్‌పై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పద్మ పురస్కార గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించినట్టు రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమమని చెబుతూ తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా మనవారే అంటూ చెప్పుకొచ్చారు. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని, ఇది ఇలాగే కొనసాగించనున్నట్టు ప్రకటించారు రేవంత్. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే ప్రజా పాలనను అభినందించినట్టేనని చెప్పారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అంతా ఏకమై ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.