ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడం కుదరదని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ చెప్పారు. సంజయ్ సింగ్ వ్యవహారం ప్రివిలేజ్ కమిటీ వద్ద విచారణలో ఉన్నందున ఆయన ఎంపీగా ప్రమాణ చేయడం వీలుపడదని స్పష్టం చేశారు. సంజయ్ సింగ్‌పై నమోదైన ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ విచారిస్తోంది.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఆప్ మరోసారి నామినేట్ చేసింది. సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్, చార్టర్డ్ అకౌంటెంట్ నరైన్ దాస్ గుప్తాను రాజ్యసభకు నామినేట్ చేశారు.
ఈ క్రమంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏడు రోజుల మధ్యంతర బెయిల్‌ను కోరుతూ సంజయ్ సింగ్ ఫిబ్రవరి 1న ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
అయితే రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే కోర్టు అనుమతినిచ్చింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఆయన బయటకు వస్తే కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది.