వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించే టిఎస్ స్థానంలో టిజిగా మార్చేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌కు వినియోగిస్తున్న టిఎస్ అక్షరాల స్థానంలో ఇకపై టిజిని వినియోగించనున్నారు. ఈ నిర్ణయంతో అందరూ అయోమయానికి గురవుతున్నారు.
అందరిలో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లో టిజి మార్చుకోవాలా? అనే అనుమానం తలెత్తుతున్నది. అయితే, ప్రస్తుతం ఉన్న వాహనాల నంబర్ల ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం జివో ఇచ్చిన తర్వాత కొత్తగా వాహనాలకు మాత్రమే టిజి పేరుతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
ప్రభుత్వం జివో జారీ చేసిన తర్వాత అప్పటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టిజి కేటాయించే అవకాశం ఉంటుంది. గతంలోనూ రాష్ట్ర విభజన సమయంలోనూ ఏపీ స్థానంలో టిఎస్ మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. అక్కడి రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను యథావిధిగా కొనసాగాయి. ప్రస్తుతం అదే పద్ధతి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ జివో వచ్చిన తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే టిజీ ఉంటుందని, అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఎస్ పేరుతో ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చాలంటే పెద్ద తలనొప్పిగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు. లక్షల వాహనాలు ఉంటాయని, అవన్నీ మార్చాలంటే కష్టమని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి అయితే టిఎస్ నెంబర్ ప్లేట్లను టిజిగా మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు టీఎస్ నంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవాల్సిన అవసరరం లేదని, మార్చుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటి వరకు వాహనదారులు ఎవరూ తమ నెంబర్ ప్లేట్లను టిజిగా మార్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.