భారత ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పార్టీ పేరు, గుర్తును కోల్పోయిన శరద్ పవార్ ”నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ” ఇక నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్ గా పోటీలోకి దిగుతుంది. కొత్త పేరుకు ఈసీఐ ఆమోదం తెలిపింది. కొత్త పేరుతోనే శరద్ పవార్ వర్గం మహారాష్ట్ర నుంచి ఫిబ్రవరి 27న జరిగే 6 రాజ్యసభ స్థానల్లో పోటీ చేయనుంది.
ఈసీ ఆదేశాల మేరకు మూడు పేర్లను శరద్ పవార్ వర్గం అందచేసింది. ”నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్”, ”నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్రావ్ పవార్”, ”ఎన్సీపీ-శరద్ పవార్” పేర్లను ప్రతిపాదించింది. దీంతో మొదటి పేరుకే భారత ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది.
ఎన్సీపీ శరద్ పవార్, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలు పార్టీ తమదేనంటూ ఈసీని ఆశ్రయించడంతో ఈసీ మంగళవారంనాడు సంచలన తీర్పునిచ్చింది. అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ పేరు, గుర్తు కేటాయించింది. మహారాష్ట్ర నుంచి రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శరద్ పవార్ వర్గాన్ని మూడు పేర్లు సూచించాల్సిందింగా ఈసీ కోరింది.