ప్రపంచంలోనే అంత్యంత విజయవంతమైన క్రికెట్ కెప్టెన్ లలో ఒకరుగా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి నిష్క్రమించడంతో భారత్ క్రికెట్ లో నాయకత్వ సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టెస్ట్ కెప్టెన్సీకి మరో సమర్ధుడైన సారధిని నియమించడం బీసీసీఐకి పెద్ద సవాలుగా మారనున్నది.
భారత్ క్రికెట్ లో కోహ్లీ అంత విజయవంతమైన కెప్టెన్ మరొకరు లేరన్నది గమనార్హం. అయితే ఆయన వత్తిడుల కారణంగానే నిష్క్రమిస్తున్నట్లు ఆయన లేఖ స్పష్టం చేస్తున్నది. ఈ వత్తిడులు బీసీసీఐ నుంచి, ముఖ్యంగా ముంబై కేంద్రంగా గల ప్రముఖుల నుండే ఎదురు కావడంతో సమర్ధవంతంగా తాను కెప్టెన్ గా కొనసాగలేననే నిర్ణయానికి వచ్చిన్నట్లు కనిపిస్తున్నది.
ముఖ్యంగా హెడ్ కోచ్ గా రవి శాస్త్రిని తప్పించి, రాహుల్ ద్రావిడ్ ను నియమించినప్పటి నుండి టీం ఇండియాలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ వస్తున్నాయి. రవి శాస్త్రి, కోహ్లీ ఇద్దరు దూడకుడుగా ఆడేవారు కావడంతో వారి మధ్య పొందిక బాగా కుదిరింది. కానీ ద్రావిడ్ నెమ్మదిగా ఆడేవాడు కావడంతో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ లో భారత్ ను విజయాపధం వైపు నడిపించలేక పోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.
బీసీసీఐకూడా పలు కీలక నిర్ణయాలు తీసుకొనే సమయంలో కెప్టెన్ గా ఉన్న కోహ్లీని విశ్వాసంలోకి తీసుకోకపోవడం కూడా పలు సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా కోహ్లీని అవమానకర రీతిలో వన్ డే టెస్ట్ కెప్టెన్ గా తప్పించడం ద్వారా ఆటగాళ్ల మధ్య విబేధాలు సృష్టించేరీతిలో వ్యవహరిస్తున్నట్లు సంకేతం పంపినట్లయింది.
సీనియర్ ఆటగాడైన బీసీసీఐ చైర్మన్ గంగూలీ హుందాగా వ్యవహరించలేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. జట్టును సరైన దిశలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహకారాన్ని అందించానన్న కోహ్లి.. తన ఏడేళ్ల టెస్ట్ కెప్టెన్సీ కెరీర్లో వందకు 120 శాతం కష్టపడ్డానని, అలా చేయలేని పక్షంలో కెప్టెన్ హోదాలో కొనసాగడం కరెక్ట్ కాదని భావిస్తున్నానని అని కోహ్లీ తన నిష్క్రమణకు కారణంగా చెప్పడం గమనార్హం.
అంటే కెప్టెన్ గా సమర్ధవంతంగా పనిచేసే సానుకూల పరిస్థితులు లేవని నిర్మోహాటంగా చెప్పిన్నట్లు భావించవలసి వస్తున్నది. పైగా, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోల్పోయిన మరుసటి రోజే ఈ ప్రకటన చేయడం గమనార్హం. తన నిష్క్రమణ గురించి కోహ్లీ ప్రకటన చేయగానే అందుకోసమే ఎదురు చూస్తున్నట్లు అభినందిస్తూ బీసీసీఐ ప్రకటన చేయడం ఈ సందర్భంగా ప్రాధాన్యతను సంతరింప చేసుకొంది.
ఇప్పటికే టి20, వన్డే కెప్టెన్సీకి దూరం అయ్యాడు. టీ20 కెప్టెన్సీ నుండి తప్పుకున్న తరువాత వన్డే కెప్టెన్సీ నుండి బిసిసిఐ కోహ్లిని తొలగించింది. ఏడేళ్లుగా తనవంతు కృషి చేస్తూనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
‘నాకు అండగా నిలిచిన రవిశాస్త్రికి, ధోనికి ధన్యవాదాలు.ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. కెప్టెన్సీ వదులుకునేందుకు ఇదే సరైన సమయం. కెప్టెన్సీ ఎప్పటికైనా వదులుకోక తప్పదు. కెప్టెన్సీ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు’ అని ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నాడు.
ఏది ఏమైనప్పటికి, కోహ్లీ బహుశా భారత్‌కు అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా మిగిలిపోతాడు. అతను తొలిసారిగా 2014లో ఆస్ట్రేలియాపై టెస్టు క్రికెట్లో జాతీయ జట్టుకు నాయకత్వం వహించాడు. అతను అపూర్వమైన బ్యాక్-టు-బ్యాక్ టెస్ట్ సిరీస్‌ను డౌన్ అండర్లో గెలుపొందడానికి జట్టుకు మార్గనిర్దేశం చేశాడు. భారత్ కూడా ప్రపంచ టెస్టు ర్యాంక్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
2021లో, భారతదేశం ప్రారంభ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా రన్నరప్‌గా నిలిచింది. జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు కోహ్లీ దూరమయ్యాడు. కోహ్లి గైర్హాజరీలో, కెఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించాడు, అయితే ప్రోటీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది.
కోహ్లి భారత టెస్ట్ కెప్టెన్సీ నుండి వైదొలగడంతో, రాహుల్ ఇంకా బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా సిద్ధంగా లేనందున సుదీర్ఘమైన ఫార్మాట్లో నాయకత్వ పాత్రలో ఇది ఖచ్చితంగా శూన్యతను సృష్టిస్తుంది. మొత్తంమీద, కోహ్లి 68 టెస్టుల్లో 40 విజయాలతో వైదొలిగాడు — టెస్టు క్రికెట్లో కెప్టెన్‌గా నాలుగో అత్యధిక విజయాలు సాధించాడు.