ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పక్రియ ప్రారంభమైన తర్వాత సుమారు 10 మంది నేతలు, ముగ్గురు మంత్రులతో సహా బిజెపికి రాజీనామా చేసి, దాదాపు అందరు ప్రధాన ప్రతిపక్షం సమాజవాద్ పార్టీలో చేరారు. దానితో దాదాపు ప్రతి పోల్ సర్వే తిరిగి బిజెపి అధికారంలో రాబోతున్నట్లు చెబుతుండగా, ఎస్పీలో ఉత్సాహం కనిపిస్తున్నది.
మూడు రోజుల్లోనే ముగ్గురు సీనియర్ మంత్రులు, ఐదుగురు ఎంఎల్ఎలు , మరో ఇద్దరు కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేయడంతో ఇక బిజెపి పనైపోయిన్నట్లే అంటూ వాఖ్యానాలు వినబడుతున్నాయి. అయితే బీజేపీలో వారి రాజీనామాలతో ఎటువంటి కలవరం కనిపించడం లేదు.
రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే కరోనాను ఏమేరకు కట్టడి చేస్తుందో, ఈ రాజీనామాలు సహితం బిజెపికి ఆ మాత్రమే నష్టం కలిగిస్తాయని ఒక బిజెపి నేత చెప్పుకొచ్చారు. ఇప్పుడు బిజెపిని వదిలి వెడుతున్న వారంతా దాదాపుగా 2017 ఎన్నికల ముందు ఆ పార్టీలో చేరిన వారే.
గత ఐదేళ్లుగా మంత్రులుగా,ఎమ్యెల్యేలుగా పదవులలో ఉన్నవారే. అప్పుడు బీజేపీలో చేరుతున్నప్పుడు ఎటువంటి కారణాలు చెప్పారో, ఇప్పుడు బిజెపిని వదిలి పోవడానికి కూడా అటువంటి కారణాలే చెబుతున్నారు.
వాస్తవానికి మారిన సామజిక సమీకరణలలో తాము తిరిగి బిజెపి అభ్యర్థులుగా గెలుపొందడం కష్టమనే లేదా బిజెపి తమకు తిరిగి సీట్ ఇవ్వదనో మాత్రమే వారు పార్టీని వదిలి వెళ్లిన్నట్లు కనిపిస్తున్నది. అందుకు ఓబిసిల పట్ల నిరాదరణ వంటి `సోషల్ ఇంజనీరింగ్’ కథనాలను మీడియా సహితం విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.
బిజెపికి దూరమైన ఎమ్యెల్యేలలో ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. వారిలో ఏడుగురు ఓబీసీలు కాగా, ఒకరు దళిత్. కాబట్టి సామజిక కోణాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. తమ కులాలను బిజెపి నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 2017లో బీజేపీలో చేరినప్పుడు సహితం తాము పార్టీ మారడానికి అదే కారణం చెప్పారు. తర్వాత ఎస్పీ నుండి మారినా అదే కారణం చెప్పవచ్చు. రాజకీయాలలో అటువంటి నాయకులను `వలస పక్షులు’ అంటారు.
ఉత్తర ప్రదేశ్ లో 18 శాతం ముస్లిం, 10 శాతం యాదవ ఓట్లు ఉన్నాయి. ఇదివరకటి ఎన్నికలలో ఎస్పీ యాదవులలో అత్యధికంగా ఓట్లు తెచ్చుకున్నా, ఇతర పార్టీలు కూడా కొంత శాతం ఓట్లు పొందుతూ ఉండెడివి. అయితే ఈ పర్యాయం ఈ రెండు వర్గాలు మూకుమ్మడిగా అఖిలేష్ యాదవ్ కు వోట్ వేస్తారని భావిస్తున్నారు. ఈ ఓటర్లు అధికంగా ఉన్న తమ నియోజక వర్గాలలో బిజెపి అభ్యర్థిగా తిరిగి గెలుపొందడం భయంతోనే, ఎస్పీలో చేరితే సులభంగా గెలవచ్చనే వీరు ప్రధానంగా పార్టీ మారడం కనిపిస్తున్నది.
గెలవలేమని పార్టీ మార్పు
ఉదాహరణకు, మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఉత్తరప్రదేశ్‌లోని పదరూనా స్థానం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగారు. రెండుసార్లు బీఎస్పీ నుండి, ఒకసారి బిజెపి నుండి గెలుపొందారు. అయితే ఈసారి కుల సమీకరణాలు తమకు వ్యతిరేకంగా ఉన్నందున ఈసారి బీజేపీలో ఉన్న తాను ఈ స్థానం నుంచి పోటీ చేస్తే గెలవలేమన్న భయంతో ఉన్నట్లు తెలుస్తున్నది.
ఈ స్థానంలో యాదవ్, ముస్లిం, ఇతర కులాల ఓటర్లు 27 శాతం ఉన్నారు. వీరిని సమాజ్ వాదీ పార్టీకి చెందిన సాంప్రదాయ ఓటర్లుగా పరిగణిస్తారు. పైగా, బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య 19 శాతం. వారి ఈయన పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అంటే, స్వామి ప్రసాద్ మౌర్యకు మొత్తం 46 శాతం మంది ఓటర్లు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నదనే భయంతోనే బిజెపిని విడిచినట్లు చెబుతున్నారు.
అయితే, 2017 ఎన్నికల్లో కూడా ఆయనకు ఈ ముప్పు ఎదురైంది. బహుశా అందుకే ఆయన బీఎస్పీని వీడి అప్పట్లో బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో మోడీ పేరు మీద బీజేపీ గెలిచింది. అంటే కులాల సమీకరణం ఉండేది. కానీ మోడీ ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. స్వామి ప్రసాద్ మౌర్య 2017 మూసలో మాత్రమే బిజెపిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని మీరు చెప్పవచ్చు.
యోగి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న దారా సింగ్ చౌహాన్ విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన స్థానంలో యాదవ సామాజికవర్గానికి చెందిన 60,000 మంది ఓటర్లు, ముస్లిం సామాజికవర్గానికి చెందిన 22,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇవి కలిపితే ఈ ఓట్లు 82వేలు. దారా సింగ్ కు ఈ ఓట్లు రాకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టమే. దారా సింగ్ చౌహాన్ మధుబన్కు బదులుగా ఘోసీ నుండి టికెట్ అడిగారని, అందుకు బిజెపి నిరాకరించడంతో పార్టీని వీడారని చెబుతున్నారు.
బీజేపీ నుంచి వైదొలిగిన మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ ఎమ్మెల్యేగా ఉన్న నకుడ్ సీటు ముస్లిం ప్రాబల్యం ఉన్న సీటు. ఈ స్థానంలో అత్యధికంగా 1.30 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ ఓట్లలో కనీసం సగం ఓట్లు నేరుగా సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి పడినా తన ఓటమి ఖాయమని ధరమ్ సింగ్ సైనీ భయపడ్డారు. అందుకే తన స్థానాన్ని కాపాడుకోవడానికి బీజేపీని వీడారు.
మరో విషయం ఏంటంటే ఈసారి తమకు టిక్కెట్లు ఇచ్చేది లేదని బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. 2017 ఎన్నికల్లో ధరమ్ సింగ్ సైనీ కేవలం 4,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీ యోగి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ముగ్గురూ వెనుకబడిన కులాల నుంచి వచ్చినవారే. ముగ్గురూ 2017 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఇక ముగ్గురూ బిత్తరపోయిన రాజీనామా భాష ఒక్కటే. ఇవి చదువుతుంటే ఈ ముగ్గురి రాజీనామాల స్క్రిప్ట్ రైటర్ ఒక్కరే ఉన్నట్లు అనిపిస్తుంది. వీరు కేవలం తమ పదవులు కాపాడుకోవడం కోసమే బిజెపిని వీడిన్నట్లు స్పష్టం అవుతుంది.
రాజీనామాలతో భయం లేదన్న తోమర్
కాగా, యూపీలో మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు పెద్ద విషయం కాదని, రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి బీజేపీకి మంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్లి బీజేపీదే అధికారం అంటూ భరోసా వ్యక్తం చేశారు. ప్రజలు తమను మరోసారి ఆశీర్వదిస్తారని చెప్పుకొచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ఆయన చెప్పుకొచ్చారు. కీలక నేతలు రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీ ఓడిపోతుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని వివరించారు. అన్ని రంగాల్లో యూపీ ఎంతో ప్రగతి సాధించిందన్నారు. ప్రతీ వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని త్లెఇపారు. కొంత మంది నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరినంత మాత్రాన బీజేపీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.
కీలక నేతలు రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీ ఓడిపోతుందనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని వివరించారు. అన్ని రంగాల్లో యూపీ ఎంతో ప్రగతి సాధించిందని, ప్రతీ వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పుకొచ్చారు. కొంత మంది నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరినంత మాత్రాన బీజేపీకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు.