రాబోయే లోక్ సభ ఎన్నికలలో తెలంగాణాలో డబల్ డిజిట్ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బిజెపి చేపట్టిన విజయ సంకల్ప యాత్ర లు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో యాత్రలు చేపట్టారు. సమక్క జాతర సందర్భంగా భద్రకాళి కాకతీయ యాత్రను ఈనెల 25వ తే దీకి వాయిదా వేశారు.
విజయ సంకల్ప యాత్రలను ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరై స్థానిక నాయకులతో జెండా ఊపి ప్రారంభించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కమలనాథులు 10 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మరోసారి అధికారం అప్పగించాలని ఓటర్లను కోరుతున్నారు. అందులో భాగంగా విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టారు.
ఈయాత్రలు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు, 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 5,500 కిలోమీటర్లు నిర్వహించనున్నారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలు ఇతర కార్యక్రమాలు ఉంటాయని ఆపార్టీ నేతలు వివరించారు. మార్చి 2వ తేదీన ముగిస్తుంది. నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ గ్రామం వద్ద కేంద్ర మంత్రి కిషన్రెడ్డి యాత్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే 17 పార్లమెంట్ స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. బిజెపికి తెలంగాణలో పూర్తి మద్దతు ఉందని, తాము ఒంటరిగానే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో ఎట్టి పరిస్ధితిలో జత కట్టమని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లుతామని తేల్చిచెప్పారు. అన్ని స్ధానాల్లో పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో గెలుపొందడమే లక్షంగా పనిచేస్తామని, మునిగిపోతున్న బిఆర్ఎస్తో స్నేహం ఉండదని స్పష్టం చేశారు.
గతంలో ఎప్పుడు తమ పార్టీ బిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. కొందరు నాయకులు కుట్రపూరితంగా బిఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారని, బుద్ధి లేని వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్ర ప్రజలు బిజెపి శ్రేణులను ఆశీర్వదించాలని కోరారు. బహిరంగ సభలు ఉండవని, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తామన్నారు.
పార్టీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలోనే తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ యాత్రలు పూర్తి చేస్తామని తెలిపారు. యాత్రలో భాగంగా రైతులు, చేతివృత్తిదారులు, నిరుద్యోగులు, పొదుపు సంఘాల మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కలుస్తారని వెల్లడించారు.
దేశంలో ఒకే గ్యారెంటి నడుస్తుందని, అది మోడీ గ్యారెంటీ మాత్రమేనని అసోం సిఎం హిమంత్ బిస్వశర్మ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన మోడీకి తెలుగు భాషపై అమితమైన ప్రేమ ఉందని తెలిపారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీజేపీకి పట్టం కడితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్ గా నిలుస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందన్నారు. 2018 సంవత్సరంలో 6.8 శాతం ఓట్లు సంపాదించగా, 2023 లో 14.9 అయిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వీళ్ల పాలన రజాకార్ల పాలనని, దీన్ని అంతం చేసే రోజులు దగ్గర పడుతున్నాయని తెలిపారు.