మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు జారీకావటం ఇది ఏడోసారి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ పేర్కొంది. గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపింది. అయితే అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు.
పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏడోసారి ఈడీ సమన్లు పంపింది. తాజా నోటీసులపై సీఎం ఇంకా స్పందించలేదు. అయితే, ఈసారైనా విచారణకు వెళ్తారో లేదో చూడాలి.
ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున సమన్లు పంపడం చట్ట విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోర్టు నిర్ణయం వచ్చే వరకూ ఈడీ వేచిచూడాల్సిందే అని పేర్కొంది. ఈడీ పంపిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మరోపక్క ఇదే కేసులో రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియాను పోలీసులు హాజరు పరిచారు. మనీష్ సిసోడియాకు జ్యూడిషియల్ కస్టడీని మార్చి 12 వ తేదీ వరకూ రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. తదుపరి దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవరులో కోర్టుకు సీబీఐ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే స్టేటస్ రిపోర్ట్‌ను బయటపెట్టవద్దని కోర్టును కోరింది. విచారణ వివరాలను వెల్లడించలేమని సీబీఐ తెలిపింది.