రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైన క్రమంలో ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణ రాష్ట్రాల్లోనూ పొత్తు దిశగా చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. ఇరు పార్టీల మధ్య పలు రాష్ట్రాల్లో పొత్తుపై తొందరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు పొత్తులు తప్పనిసరని పార్టీ భావిస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఇప్పటికే ఖరారైంది. ఢిల్లీలో పాలక ఆప్ నాలుగు స్ధానాల్లో కాంగ్రెస్ మూడు స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది.
ఇక మరో మూడు రాష్ట్రాల్లోనూ ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైందని చెబుతున్నారు. ఇక గుజరాత్లో రెండు లోక్‌సభ స్ధానాల్లో, హరియాణలో ఒక స్ధానంలో ఆప్ పోటీ చేయనుంది. అయితే, పంజాబ్‌లో ఇరు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్‌లో మొత్తం 13 స్ధానాల్లో ఆప్ బరిలో దిగుతుందని చెప్పారు.
మరోవంక, ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు సమాజ్‌వాదిపార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు ఈ వార్త వెలువడటం గమనార్హం.
ఇలాగుండగా, ఇప్పుడు మమతా బెనర్జీ కూడా తన వైఖరిని తగ్గించుకుని సీట్ల పంపకంపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల్ ఒంటరిగా పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. కానీ ఇప్పుడు బెంగాల్, మేఘాలయలో కూడా కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య తుది చర్చలు ఖారారు కానున్నాయని అంటున్నారు