రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన అనంతరం.. అభ్యర్థుల ఆగస్టు ఆస్తుల విలువ రూ.127.81కోట్లుగా ఉందని ఏడీఆర్ తెలిపింది.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం 59 మంది అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల రేసులో ఉన్నారు. అయితే, కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థి జీసీ చంద్రశేఖర్ అఫిడవిట్ మాత్రం విశ్లేషించలేకపోయారు. స్కాన్ చేసిన పత్రాలు చదవడం సాధ్యం కాలేదని.. దాంతో 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను మాత్రమే పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది.
ఇందులో 36శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 17శాతం మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ అభ్యర్థిపై హత్యాయత్నం ఆరోపణలున్నాయి.
ఆ విశ్లేషణ ప్రకారం, 30 మంది బిజెపి అభ్యర్థులలో ఎనిమిది (27 శాతం) మంది, తొమ్మిది మంది కాంగ్రెస్ అభ్యర్థులలో ఆరుగురు (67 శాతం), నలుగురు టిఎంసి అభ్యర్థులలో ఒకరు (25 శాతం), ముగ్గురు ఎస్పి అభ్యర్థులలో ఇద్దరు (67 శాతం), ముగ్గురు వైసిపి అభ్యర్థులలో ఒకరు (33 శాతం), ఇద్దరు ఆర్జెడి అభ్యర్థులలో ఒకరు (50 శాతం), ఇద్దరు బిజెడి అభ్యర్థులలో ఒకరు (50 శాతం), ఒక బిఆర్ఎస్ అభ్యర్థి (100శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తమ అఫిడవిట్లలో వెల్లడించారు.
ఈ సందర్భంగా అభ్యర్థుల ఆర్థిక పరిస్థితిని సైతం అంచనా వేసింది. దాదాపు 21శాతం మంది అభ్యర్థులు బిలియనర్లీ కాగా.. రూ.100కోట్లకుపైగా ఆస్తులున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.127.81 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది.