పాలస్తీనీయులను చంపేందుకు ఇజ్రాయిల్‌కు లైసెన్స్ ఇచ్చింది అమెరికాయేనని ఐక్యరాజ్య సమితికి చెందిన మూడు సంస్థలు విమర్శించాయి. పాలస్తీనీయులకు మానవతా సాయం అందకుండా చేయడం, కాల్పుల విరమణకు అడ్డు పడడంలో ఇజ్రాయిల్‌కు ఎంత పాత్ర ఉందో, అమెరికాకు కూడా అంతే పాత్ర ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి), మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసిహెచ్‌ఎ), ఆహార, వ్యవసాయక సంస్థ (ఎఫ్ఎఓ) చెప్పాయి. గాజాలో తాజా పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి)కి ఈ సంస్థలు ఇచ్చిన రిపోర్టులో ఈ మేరకు అభిప్రాయపడ్డాయి.
గుయానా, స్విట్జర్లాండ్, అల్జీరియా, స్లొవేనియా అభ్యర్థన మేరకు ఐరాస భద్రతా మండలి దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గాజాలో మొత్తం 22 లక్షల మంది పాలస్తీనీయులకు గాను చాలా మంది ఇప్పటికే ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లిపోగా, మిగిలినవారిలో 5 లక్షల మంది ఇప్పుడు తీవ్రమైన క్షామాన్ని ఎదుర్కొంటున్నారని డబ్ల్యుఎఫ్‌పి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కార్ల్ స్కువా భద్రతామండలికి తెలిపారు.
ఆరేళ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపం చాలా తీవ్రంగా ఉందని స్కువా తెలిపారు. ఆసుపత్రులకు విద్యుత్, మంచినీరు సరఫరా చేయడం, పారిశుధ్య సేవలను పునరుద్ధరించడం, మానవతా సాయం సరఫరాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడడం తక్షణం చేపట్టాలని స్కువా తెలిపారు. ఇజ్రాయిల్ దళాలు విచక్షణా రహితంగా జరుపుతున్న వైమానిక దాడుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది, ఆసుపత్రులను, ఐరాస సహాయక శిబిరాలను కూడా వారు వదల్లేదు.
5 మాసాలుగా సాగుతున్న ఈ దాడుల్లో గాజాలో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇజ్రాయిల్ చర్యలను అమెరికన్ ప్రతినిధి రాబర్ట్ వుడ్ వెనకేసుకొచ్చారు. ఐక్యరాజ్య సమితి సహాయక చర్యల సంస్థ (యుఎన్ఆర్డబ్బ్యుఎ)ను గాజాలో తిరిగి పనిచేసుకునేందుకు అనుమతించాలని చైనా, రష్యాతో సహా పలు ప్రపంచ దేశాలు డిమాండ్ చేశాయి.
కాగా, వెస్ట్‌గాజా సిటీలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 112 మంది మరణించగా, 750 మందికి పైగా గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఊచకోతని ఖండించింది.
మానవతా సాయం అందిస్తున్న 38 ట్రక్కుల చుట్టూ వేలాది మంది గాజన్లు సాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. దీంతో డజన్ల కొద్దీ మరణాలు, గాయాలకు దారితీసిందని పేర్కొంది. ముప్పు పొంచి వుండటంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకోవడం, ప్రజలపై నుండి ట్రక్కులు వెళ్లడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది.
ఈ ఘటనపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైనా విదేశాంగ ప్రతినిథి మావో తెలిపారు. ఈ ఘటన కాల్పుల విరమణ చర్చలను క్లిష్టతరం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు.
ఈ మరణాలు భయంకరమైనవని వైట్ హౌస్ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం పంపించాలని కోరామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. దర్యాప్తును పర్యవేక్షిస్తుందని, బాధ్యుల నుండి సమాధానం కోరుతున్నట్లు తెలిపారు. ఈ ఘటన ఘోరమని ఫ్రాన్స్ పేర్కొంది. సాయం కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన కాల్పులు సమర్థనీయం కాదని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మానవత్వానికి వ్యతిరేకంగా మరోనేరమని టర్కీ పేర్కొంది. ”మానవతా సాయం కోసం క్యూలైన్లలో ఎదురుచూస్తున్న అమాయక పౌరులను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకోవడం, వారిని ఉద్దేశపూర్వకంగా సమిష్టిగా అంతం చేయాలని భావించిందనడానికి నిదర్శనం” అని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయిల్ నుండి ఆయుధాల కొనుగోళ్లను రద్దుచేస్తున్నట్లు కొలంబియా ప్రకటించింది. పాలస్తీనియన్లపై మారణహోమాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఖండించారు.